ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: స్వామిగౌడ్

19 Jul, 2014 00:36 IST|Sakshi
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: స్వామిగౌడ్

సాక్షి,సిటీబ్యూరో: కొత్త ప్రభుత్వంలో అందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని తెలంగాణ శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో శుక్రవారం సత్కళా భారతి హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘జయ జయహే తెలంగాణ’ సంగీత నత్యరూపకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జయజయహే నృత్యరూపకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించారు.

60 ఏళ్ల తెలంగాణ పోరాట ఘట్టాలను ఒక గంటలో చూపించడం మహాద్భుతమన్నారు. నృత్య రూపకానికి దర్శకత్వం వహించిన డాక్టర్ కోట్ల హనుమంతరావు, సంగీతం సమకూర్చిన డీఎస్‌వీ శాస్త్రి, రచన చేసిన డాక్టర్ వడ్డేపల్లి కష్ణలు అభినందనీయులన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణ మాట్లాడుతూ నృత్యరూపక కళాకారులకు అభినందనలు తెలిపారు.

రాష్ట్ర ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ స్వీయ రాజకీయ చిత్తం కోసం పోరాడి...చివరికి సాధించుకున్నదని చెప్పారు. రాజకీయాలు మాట్లాడేవారు తెలంగాణ పోరాటం విముక్తి కోసం జరిగిన పోరాటంగా గుర్తించడం లేదన్నారు. గురుకుల భూములను ప్రభుత్వం తీసుకోవాలనుకుంటోందన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ జయ జయహే తెలంగాణ నృత్యరూపకం, తెలంగాణ జనపద గేయాలు భేషుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. అనంతరం నృత్య రూపకంలో పాల్గొన్న కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్కళా భారతి అధ్యక్షుడు జి.సత్యనారాయణ, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
 
ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసిన రూపకం
 
జయ జయహే తెలంగాణ సంగీత నృత్య రూపకం 60 ఏళ్ల తెలంగాణ పోరాటంలోని కీలక ఘట్టాలను ఒక గంటలో కళ్ల ముందుంచింది. దీన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలు, నేతలు ఉత్కంఠగా సన్నివేశాలను తిలకించారు. రవీంద్రభారతి ప్రాంగణంలో ఉన్న యావన్మంది రూపకాన్ని రచించిన డాక్టర్ వడ్డేపల్లి కష్ణ, దర్శకత్వం వ హించిన డాక్టర్  అనితారావు, డాక్టర్ కోట్ల హనుమంతరావు, సంగీతం సమకూర్చిన డీఎస్‌వీ శాస్త్రిలను ప్రశంసించారు.

>
మరిన్ని వార్తలు