కూటమి ప్రభావమెంత?

3 Nov, 2018 01:42 IST|Sakshi

న్యాయవాదులతో నేడు టీఆర్‌ఎస్‌

అధినేత కేసీఆర్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతృత్వంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల కూటమి ఏర్పాటుపై పూర్తి స్థాయి స్పష్టత రావడంతో దీని ప్రభావంపై టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆరా తీస్తున్నారు. కూటమి ఏర్పాటు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజా పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సర్వేలతోపాటు వివిధ మార్గాల్లో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకుంటున్నారు. దీనిపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలువురు టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో చర్చించారు. సీట్ల వారీగా పొత్తులపై స్పష్టత వచ్చిన తర్వాత కూటమిలోని పార్టీల మధ్యే వివాదాలు మొదలవుతాయని పలువురు నేతలు కేసీఆర్‌కు వివరించారు. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించాక 80 శాతానికిపైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటు పరిస్థితులు ఉంటాయని తెలిపారు. కూటమిలోని పరిస్థితులకు తగినట్లుగా రాజకీయ వ్యూహం అమలు చేయాలని కేసీఆర్‌ పార్టీ నేతలకు, అభ్యర్థులకు సూచించారు. పలువురు అభ్యర్థులు ప్రచారంలో కీలకంగా వ్యవహరించడంలేదనే విషయం ఆయన దృష్టికి వచ్చింది. ప్రత్యర్థి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిరోజు ప్రచారం కొనసాగించాలని అభ్యర్థులను ఆదేశించారు.  

ప్రతి జిల్లాలో ఎన్నికల సెల్‌...
టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కోసం ప్రతి జిల్లాలో ఎన్నికల సెల్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. 31 జిల్లాల్లో న్యాయవాదులు, చార్టెడ్‌ అకౌంటెంట్, ముఖ్య నేతలతో కలిపి ఈ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం, అవసరమైన పత్రాలను సిద్ధం చేసేందుకు ఈ సెల్‌ పని చేస్తుంది. అభ్యర్థుల రోజువారీ ఖర్చుల మదింపు, నియమావళికి అనుగుణంగా ప్రచార షెడ్యూల్‌ వంటి అంశాలపై ఎన్నికల సెల్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ప్రత్యర్థి పార్టీలు నిబంధనలను అతిక్రమిస్తే ఫిర్యాదు చేయడం, ప్రత్యర్థి పార్టీలు చేసే ఫిర్యాదులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం వంటి పనులు చేస్తుంది. ఈ సెల్‌లో బాధ్యతలు నిర్వహించే న్యాయవాదులతో టీఆర్‌ఎస్‌ అధినేత శనివారం సమావేశం కానున్నారు. ఎన్నికల సెల్‌ పని చేయాల్సిన అంశాలపై మార్గనిర్దేశనం చేయనున్నారు.

తమిళ, మొదలియార్‌ సంఘాల మద్దతు...
తెలంగాణలోని తమిళ సమాజం టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. హైదరాబాద్‌ తమిళ సంఘం, మొదలియార్‌ సంఘం, మొదలియార్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీల ప్రతినిధులు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితను శుక్రవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపి కార్పొరేటర్లుగా గెలిపించుకున్నామని, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని ఈ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న తీరును ప్రశంసించారు. తెలంగాణలో ఉన్న ఇతర రాష్ట్రాల వారి సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాటుపడుతుండటం ఆనందంగా ఉందని చెప్పారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో మొదలియార్‌లు బీసీ–డీ గ్రూప్‌లో కొనసాగుతున్నారని... ఆదిలాబాద్, వరంగల్, మెదక్‌ జిల్లాల్లోనూ ఈ వర్గాలను బీసీ–డీలోకి మార్చాలని కోరారు. మొదలియార్‌ అసోసియేషన్, మొదలియార్‌ ఎడ్యుకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సికింద్రాబాద్‌ అధ్యక్షుడు ఏ.ఎస్‌.జయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సి.ఎస్‌.సుధాకర్, హైదరాబాద్‌ తమిళ సంఘం అధ్యక్షుడు సాయికాంత్, జాయింట్‌ సెక్రటరీ మారన్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు జలగం ప్రసాదరావు చేరిక
మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడైన ప్రసాదరావు కొన్నేళ్లు రాజకీయంగా స్తబ్ధుగా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని మొదట భావించారు. అయితే కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం వైఖరి కారణంగా టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ప్రసాదరావు నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మహబూబాబాద్, డోర్నకల్‌లో శనివారం జరగనున్న నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.

>
మరిన్ని వార్తలు