వంద రోజుల్లో అమల్లోకి అన్ని గ్యారంటీలు..

11 Dec, 2023 04:44 IST|Sakshi
ఆదివారం కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద మంత్రులు భట్టి,పొంగులేటి, తుమ్మలకు గజమాలతో స్వాగతం పలుకుతున్న దృశ్యం   

సంపద సృష్టించి పేదలకు పంచుతాం: డిప్యూటీ సీఎం భట్టి 

ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు ఘన సన్మానం

ఖమ్మం వన్‌టౌన్‌: రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం ఆయన ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళా సాధికారతకు తొలి అడుగు వేస్తూ మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామనీ, పేదల కోసం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని వెల్లడించారు. రానున్న వంద రోజుల్లో మిగిలిన నాలుగు గ్యారంటీలను అమలు చేస్తామని, అన్ని వర్గాల ప్రజలకు సంపదను పంచి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని భరోసానిచ్చారు. 

రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి ఒకరు ఇంగితజ్ఞానం లేకుండా రెండు రోజులు గడవక ముందే తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, కొంచెమైనా జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్మంతా పందికొక్కుల్లా తిన్నారని, అదంతా కక్కించి తీరుతామని స్పష్టం చేశారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన అనేక అవకతవకలు, లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతామని, రాష్ట్రం నష్టాల్లో ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీల అమలుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. సమావేశంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద ముగ్గురు మంత్రులకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికి గజమాలలతో సత్కరించారు. అక్కడి నుంచి మంత్రులు భారీ కాన్వాయ్‌తో ఖమ్మం చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

>
మరిన్ని వార్తలు