'కేసీఆర్ హామీల విలువ రూ.10 లక్షల కోట్లు'

6 Aug, 2015 19:02 IST|Sakshi
'కేసీఆర్ హామీల విలువ రూ.10 లక్షల కోట్లు'

కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ గత 14 నెలల కాలంలో ఇచ్చిన హామీల విలువ రూ.10 లక్షల కోట్లు దాటిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు మినహా రైతులు, సామాన్యులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేశానంటూ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేసిన కేసీఆర్... అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావుతో కలసి రమణ మాట్లాడారు.

గత ఏడాది కరవుతో రైతులు ఇబ్బంది పడ్డా పట్టించుకోలేదని, కనీసం కేంద్రానికి నివేదిక పంపలేదని అన్నారు. కేంద్రం వద్దకు వెళ్లి సాయం కోరితే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదని, వాళ్లు నివేదిక ఇవ్వకుండా తాము ఎలా జోక్యం చేసుకోగలమని అన్నారని తెలిపారు. ఈ ఏడాది కూడా మళ్లీ వర్షాల్లేక వేసిన పంటలు మొలకెత్తే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. రెతుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని, ఇప్పటికే వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నాని, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.
 

మరిన్ని వార్తలు