కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం

18 Sep, 2018 13:07 IST|Sakshi
మాట్లాడుతున్న కోదండరాం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనకు చరమ గీతం పాడుదామని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. మండల కేంద్రంలోని హవేళిఘణాపూర్‌లో సోమవారం ఆయన తెలంగాణ జన సమితి జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమన్నారు. అమరవీరుల ప్రాణత్యాగాలపై ఏర్పడిన తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందన్నారు.

నిజాంను తలదన్నే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఎదిరించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన సూచించారు. అనంతరం భారీ బైక్‌ ర్యాలీతో మెదక్‌ పట్టణానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జన సమితి నాయకులు శ్రీకాంత్, రాజశేఖర్‌ రెడ్డి, దయాసాగర్‌ తదితరులున్నారు.

కుల వివక్ష బాధాకరం
రామాయంపేట(మెదక్‌): రాష్ట్రంలో కులం పేరుతో వివక్ష కొనసాగుతుండటం బాధాకరమని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం రామాయంపేట వచ్చిన సందర్భంగా జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామిక విలువలు విస్తృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ అనే యువకుడు ఇతర కులం యువతిని పెళ్లి చేసుకున్నాడనే కక్షతో పాశవికంగా హతమార్చాడం అనాగరికమని ఆయన పేర్కొన్నారు.

ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి వివక్షను విడనాడాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక బాలుడు అందజేసిన నాగలిని ఆయన అందుకుని ఆ బాలుడిని అభినందించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, మండలశాఖ అధ్యక్షుడు పోచమ్మల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అమరవీరులకు టీజేఎస్‌ నివాళి
చిన్నశంకరంపేట(మెదక్‌): అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోల్కూరి జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనతో ప్రజలకు తీరని నష్టం జరుగుతోందన్నారు.

టీఆర్‌ఎస్‌ను పారదోలే సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తెలంగాణ జన సమితి వెంట నిలవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్‌ ర్యాలీని టీజేఎస్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి కనకయ్య జెండా ఊపి ప్రారంభించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభమైన బైక్‌ ర్యాలీ గవ్వలపల్లి చౌరస్తా, మడూర్, శాలిపేట, ఖాజాపూర్, సంకాపూర్, జప్తిశివనూర్‌ల మీదుగా రామాయంపేటకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ నాయకులు సత్యనారాయణరెడ్డి, సిద్దిరాములు, శ్రీనివాస్, రాజిరెడ్డి, ఎడ్ల కిష్టయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు