నేడు కృష్ణా బోర్డు భేటీ

4 Jun, 2020 05:31 IST|Sakshi

హాజరుకానున్న ఇరు రాష్ట్రాల కార్యదర్శులు, ఇంజనీర్లు 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జల వివాదాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు గురువారం ఇక్కడ జలసౌధలో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఆరంభం అయ్యే ఈ భేటీకి బోర్డు చైర్మన్‌ పరమేశంతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీలు మురళీధర్, నారాయణరెడ్డిలు హాజరుకానున్నారు. ఇరు రాష్ట్రాలు లేవనెత్తుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ అంశంతో పాటు, టెలిమెట్రీల వ్యవస్థ ఏర్పాటు, ఈ వాటర్‌ ఇయర్‌లో నీటి పంపిణీ, మళ్లింపు జలాల వాటా తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.ఈ బోర్డులో ప్రస్తావనకు తేవాల్సిన అంశాలపై శాఖ ఇంజనీర్లు రజత్‌కుమార్‌తో చర్చించారు. బోర్డు ముందు తేవాల్సిన అంశాల వారీగా నివేదికను సిద్ధం చేసుకున్నారు. 

గోదావరి బోర్డు ఎజెండా ఖరారు
ఇక ఈనెల 5న జరిగే గోదావరి భేటీలో చర్చికు లేవనెత్తే ఎజెండా అంశాలను గోదావరి బోర్డు సిద్ధం చేసింది. ఏపీ అభ్యంతరం చెబుతున్న కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, బోర్డుకు నిధుల కేటాయింపు, సిబ్బంది నియామకం, టెలిమెట్రీ ఏర్పాటు తదితర అంశాలను ఎజెండాలో చేర్చింది. 

మరిన్ని వార్తలు