కృష్ణా జల వివాదంపై ఎటూ తేల్చని కేంద్రం

10 Feb, 2015 03:45 IST|Sakshi
  • సమస్యను పట్టించుకోని కేంద్ర జలవనరుల శాఖ
  • సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో అపాయింట్‌మెంట్ ఇవ్వని మంత్రి ఉమాభారతి
  • సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న కృష్ణా నదీ జలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా తన మౌనాన్ని వీడటం లేదు. వివాదంలో జోక్యం చేసుకునే అవకాశాలపై న్యాయ శాఖను సంప్రదించామని సమాచారం ఇచ్చిన కేంద్ర జల వనరుల శాఖ తదనంతర చర్యలపై మళ్లీ స్తబ్ధుగా మారిపోయింది.

    కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి సమస్యను వివరించి సానుకూలంగా మలచుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగినా ఆమె అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా నిరాశపరిచారు. దీంతో కృష్ణానదిలో 119 టీఎంసీల నీటి లభ్యత ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మొదలైన వివాదం ప్రస్తుతం నీటి నిల్వలు 51 టీఎంసీలకు పడిపోయినా పరిష్కారం మాత్రం లభించలేదు. కృష్ణానదిలో నాగార్జునసాగర్ వరకు మొత్తంగా 616.37 టీఎంసీల నీటి లభ్యత ఉండగా అందులో 549.652 టీఎంసీల నీరు వాడుకునేందుకు ఇరు రాష్ట్రాలకు అవకాశం ఉంది.

    ఈ నీటిని తెలంగాణ, ఏపీలు 41.61శాతం, 58.39శాతం చొప్పున వాడుకోవాల్సి ఉంది. ఇందులో ఏపీకి దక్కే నిర్ణీత వాటా 320.94 టీఎంసీలను దాటి మరో 1.722 టీఎంసీలు అదనంగా వాడుకున్న అనంతరం తొలిసారి వివాదం రేగింది. వెంటనే అప్రమత్తమైన తెలంగాణ గత ఏడాది డిసెంబర్‌లోనే ఏపీ వైఖరిని కృష్ణా నది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణాలో ఏపీ వాటా పూర్తయినందున లభ్యతగా ఉన్న 119 టీఎంసీల నీరు మొత్తం తమదేనని తేల్చిచెప్పింది.

    ఇక్కడినుంచి మొదలైన వివాదం ఇరు రాష్ట్రాల చర్చలు, బోర్డుకు వరుస లేఖలతో ముందుకు సాగినా ఫలితం తేలలేదు. దీంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కేంద్ర మంత్రి సహా, కేంద్ర అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి కేంద్ర జోక్యానికై విన్నవించారు. దీనిపై మొదట అంటీముట్టనట్టుగా వ్యవహరించిన కేంద్రం పెరుగుతున్న ఒత్తిళ్ల మేరకు తమ జోక్యం చేసుకునే పరిధిని తెలపాలంటూ కేంద్ర న్యాయ శాఖను సంప్రదించింది.

    అయితే న్యాయ శాఖ ఎలాంటి సూచనలు చేసింది.., దానిపై జల వనరుల శాఖ వైఖరేంటన్నదీ ఇప్పటివరకు వెల్లడికాలేదు. దీంతో మరోమారు కేంద్ర మంత్రిని కలసి సమస్యను వివరించాలని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. వివిధ కారణాలతో అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో ఉమాభారతిని కలవకుండానే సీఎం కేసీఆర్ వెనుదిరిగారు.

మరిన్ని వార్తలు