కేటీఆర్‌తో సనోఫి బృందం భేటీ..

6 Mar, 2020 03:34 IST|Sakshi
సనోఫి సంస్థ ప్రతినిధి జెఫ్రాయ్‌కు జ్ఞాపిక అందజేస్తున్న మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి. చిత్రంలో వరప్రసాద్‌రెడ్డి, అన్నపూర్ణ దాస్, జయేశ్‌రంజన్‌

సనోఫికి సహకారం అందిస్తాం: మంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: నూతన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఇక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సనోఫి వంటి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌ అంతర్జాతీయ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా రూపాంతరం చెందిందని, ఇక్కడ వ్యాక్సిన్‌ తయారీ, సంబంధిత రంగా ల్లో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ ఈకో సిస్టమ్‌లను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలను మంత్రి వివరించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న సాంకేతికత, అద్భుత మైన మానవ వనరుల నేపథ్యంలో డిజిటల్‌ డ్రగ్‌ డిస్కవరీ వంటి వినూత్న రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

గురువారం ప్రగతిభవన్‌లో ప్రముఖ ఫార్మా కంపెనీ సనోఫి అంతర్జాతీయ భాగస్వామ్యాల అధిపతి (హెడ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సైట్స్, పార్టనర్‌షిప్స్‌) ఫాబ్రయ్స్‌ జెఫ్రాయ్, భారత్, దక్షిణాసియా జనరల్‌ మేనేజర్‌ అన్నపూర్ణ దాస్‌లు మంత్రితో సమావేశమయ్యారు. వీరితో పాటు శాంతా బయోటెక్‌ చైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి కూడా ఉన్నారు. 2021 సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంవత్సరంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు చేపడుతోందని, ఇప్పటికే అనేక ఫార్మా కంపెనీలు తమతో భాగస్వాములు అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయన్నారు. భవిష్యత్తులో సనోఫి కార్యకలాపాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. తెలంగాణలో సనోఫి కార్యకలాపాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై సనోఫి సానుకూలత వ్యక్తం చేసింది. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు