నెరవేరిన రైతుల కల

17 Jun, 2018 09:45 IST|Sakshi
 నకిరేకల్‌లో ప్రారంభానికి సిద్ధమైన నిమ్మ మార్కెట్‌ 

నకిరేకల్‌ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బత్తాయి, నిమ్మ మార్కెట్ల ప్రారంభ కల నెరవేరనుంది. తెలంగాణ ప్రభుత్వం నల్లగొండలోని గంధంవారిగూడెంలో బత్తాయి, నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. వీటిని ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా నిమ్మకు సరైన మద్దతు ధర లేకపోవడం, దళారుల ప్రమేయంతో సంబంధిత రైతులు తీవ్ర నష్టాన్ని సవిచూస్తున్నారు. ఇకపై ఆ సమస్యల చెక్‌ పడనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే  మొదటి నిమ్మ మార్కెట్‌ జిల్లాలోని నకిరేకల్‌లో ఏర్పాటు చేశారు. రూ.3.07 కోట్లతో నిమ్మ మార్కెట్‌ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల ముందు ప్రజ లకు ఇచ్చిన హామీలో భాగంగా మార్కెట్‌ను మం జూరు చేయించారు. çనకిరేకల్‌లోని చీమలగడ్డ శివారులో అన్ని సౌకర్యాలతో ఆ మార్కెట్‌ను నిర్మించారు. దీనిని ఆదివారం ఉదయం 10 గం టలకు మంత్రులు ప్రారంభించనున్నారు.  

ఏటా రూ.750 కోట్ల వ్యాపారం 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏటా రూ.750 కోట్ల నిమ్మ వ్యాపారం సాగుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాపారం అంతా అనధికారికంగా దళారులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే నిమ్మకాయల వ్యాపారానికి ప్రసిద్ధిగాంచిన నకిరేకల్‌ ప్రాంత రైతులు నిమ్మ మార్కెట్‌ లేకపోవడంతో దళారులను ఆశ్రయిస్తూ నిండా మునుగుతున్నారు. దాంతో 2016 ఆగస్టు 3న మార్కెట్‌ నిర్మాణానికి రూ.3.07 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 అక్టోబర్‌ 24వ తేదీన నకిరేకల్‌ పెద్ద చెరువు వద్ద నిమ్మ మార్కెట్, మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి శిలాపలకాలను ఆవిష్కరించారు. 2017 మే 15న స్థల సేకరణ సమస్య పరిష్కారమైంది.

తిప్పర్తిరోడ్డులోని చీమలగడ్డ సర్వే నంబర్‌ 459లో 9.39 ఎకరాల స్థలాన్ని మార్కెట్‌ నిర్మాణం కోసం ఎంపిక చేశారు. ఈ స్థలంలోని 10 మంది భూ నిర్వాసితులకు రూ.39.90 లక్షల పరిహారం మంజూరు చేసింది. 2017 జూన్‌ 6న చీమలగడ్డలో ఎమ్మెల్యే వేముల వీరేశం భూమి పూజ  చేశారు. రూ. కోటితో 2500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో జర్మనీ దేశం నుంచి తెప్పించిన మెటీరియల్‌తో  గ్రేడింగ్‌ కవర్డ్‌ ఫ్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు. రూ.75లక్షలతో వ్యాపారుల కోసం 25 దుకాణ సముదాయం, రూ.17లక్షలతో నిమ్మ మార్కెట్‌ కార్యాలయ భవనం నిర్మించారు. రైతులకు మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కూడా కల్పిస్తున్నారు. యార్డులో అంతర్గత సీసీ రహదారి నిర్మాణం కూడ కొంత మేర పూర్తయింది.  

ఉమ్మడి జిల్లాలో నిమ్మసాగు ఇలా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 వేల హెక్టార్లకు పైగా నిమ్మ తోటలు సాగవుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే హెక్టార్‌కు 10టన్నుల దిగుబడి వస్తుంది. నిమ్మకు మంచి ధర ఉంటే క్వింటాకు సరాసరి రూ. 2వేల ధర పలుకుతుంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో ఏటా రూ. 750 కోట్ల నిమ్మ వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం అంతా అణధికారికంగా గత మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతుంది.  నూతనంగా నిర్మించబోయే ఈ నిమ్మ మార్కెట్‌ ప్రారంభమైతే మా ర్కెట్‌ ఫీజుల రూపంలో ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది. 

నేడు బత్తాయి మార్కెట్‌ ప్రారంభం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని బత్తాయి రైతుల ఎన్నో ఏళ్ల కల  సాకారం కానుంది.  జిల్లా కేంద్రంలోని  గంధంవారిగూడెంలో రూ.1.80 కోట్ల వ్యయంతో గత ఏడాది నిర్మాణ పనులు మొదలైన బత్తాయి మార్కెట్‌ పూర్తయింది. బత్తాయి మార్కెట్‌ నిర్మాణ పనులకు గతేడాది రాష్ట్ర సాగునీటి పారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కాగా, ఏడాది వ్యవధిలోనే మార్కెట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయించి తానే మార్కెట్‌ను ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు నాడు ప్రకటించారు. ఆ విధంగానే ఆదివారం సాయంత్రం 3 గంటలకు బత్తాయి మార్కెట్‌ను ప్రారంభించనున్నారు. 

రైతులకు ఎంతో వెసులుబాటు
జిల్లాలోని బత్తాయి రైతులు తమ పంటను విక్రయించుకోవడానికి పూర్తిగా దళారులపైనే ఆధారపడుతున్నారు. కర్నూలు తదితర జిల్లాల నుంచి వచ్చే దళారులు తోటలపైనే బత్తాయికి రేటు మాట్లాడుకుని అరకొరగా రైతులకు చెల్లించి వారు లాభాలు పొందుతున్నారు. ఒక వేళ ఎవరైనా రైతు స్వయంగా మార్కెట్లో బత్తాయి అమ్ముకోవడానికి వెళితే హైదరాబాద్‌ కొత్తపేట మార్కెట్‌లో దళారుల చేతుల్లో పడి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు స్థానికంగానే బత్తాయి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని బలంగా డిమాండ్‌ చేశారు. కాగా మార్కెట్‌ మంజూరుకావడం , ఏడాదిలోగా నిర్మాణం పనులు పూర్తయి అందుబాటులోకి వస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మార్కెట్‌లో ఎనిమిది మంది కమీషన్‌ ఏజెంట్లు, నలుగురు ట్రేడర్స్‌ లైపెన్స్‌ పొందారు. ఆదివారం నుంచి బత్తాయిలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.  

అధికార పార్టీ ఏర్పాట్లు
మరో వైపు మార్కెట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి హరీశ్‌రావు మార్కెట్‌ను ప్రారంభించనుండగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నల్లగొండ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బత్తాయి మార్కెట్‌ను ప్రారంభించాక గంధంవారి గూడెం నుంచి బైకు ర్యాలీ ద్వారా మంత్రిని స్థానిక బీట్‌ మార్కెట్‌కు తీసుకువస్తారు. అనంతరం మార్కెట్‌లోనే బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శనివారం నల్లగొండ వ్యవసాయ  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కరీంపాష , డైరెక్టర్‌ గార్లపాటి శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి మధు బత్తాయి మార్కెట్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.  

మరిన్ని వార్తలు