పెద్దగట్టుకు పీట

20 Dec, 2014 01:02 IST|Sakshi

⇒ రూ.2.10 కోట్లు మంజూరు
⇒సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటన
⇒హర్షం వ్యక్తం చేస్తున్న యాదవులు
⇒ వచ్చే ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీదాకా
⇒లింగమంతులస్వామి జాతర
సూర్యాపేట : రాష్ట్రంలోనే మేడారం తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు మహర్దశ పట్టనుంది. ఈ ఏడాది జాతర నిర్వహణకు రూ.2.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం రాష్ట్ర రాజధానిలో  జాతరపై నిర్వహించిన సమీక్షసమావేశంలో ఈమేరకు ఆయన ప్రకటన చేశారు. దీంతో లక్షలాది మంది యాదవుల ఆరాధ్య  దైవమైన దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగింది. ప్రతి రెండేళ్లకోసారి లక్షలాది మంది తరలివచ్చి ఘనంగా నిర్వహించుకునే ఈ జాతరలో అరకొర వసతులతో భక్తులు  అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. గత రెండు జాతర్లకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ మంజూరు కాలేదు. సూర్యాపేట స్థానిక ఎమ్మెల్యే రెండు విడతలుగా రూ.5 లక్షల చొప్పున తన నిధుల నుంచి కేటాయించి,  చిన్నగా దేవాలయాల స్థానంలో పెద్ద దేవాలయం నిర్మాణం, మహామండపం నిర్మాణాన్ని చేపట్టారు.
 
వేలం పాట నిధులతోనే జాతర నిర్వహణ..
జాతరలో నిర్వహించే వేలం పాటలతో వచ్చే నిధులతోనే అరకొర వసతులు ఏర్పాటు చేసేవారు. తలనీలాలు, కొబ్బరికాయలు, దుకాణాల కేటాయింపు తదితర వాటి  వేలంపాటకు  వచ్చిన డబ్బులతోనే జాతర నిర్వహించేవారు.
 
శాశ్వత నిర్మాణాలు..    
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అనేక మంది మేధావులు, భక్తులు దురాజ్‌పల్లి జాతరలో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ వస్తున్నారు. దీంతోపాటు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో చర్చించి పెద్దగట్టు జాతరకు నిధులు కేటాయించేందుకు తన వంతు కృషిచేశార. ఆ నిధులతో జాతరలో మహిళలకు స్నానాల గదులు, మరుగుదొడ్లు, శాశ్వత తాగునీటి వసతి  ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. అదే విధంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా గుట్ట చుట్టూ స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది.
 
20 లక్షలకుపైగా భక్తులు వచ్చే అవకాశం
వచ్చే ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు జరిగే జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షలకు పైగా భక్తులు తరలిరానున్నారు. గతంలో 3 రోజులు మాత్రమే నిర్వహించే జాతరను ఈసారి 5 రోజులు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు