పల్లెల్లో మద్యం పడగ

19 Jun, 2018 13:08 IST|Sakshi
బెల్టు దుకాణాల్లో పట్టుబడిన మద్యం చూపుతున్న మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీసులు (ఫైల్‌)   

దాదాపుగా కనుమరుగైన గుడుంబా

ఆ స్థానంలో ఏరులై పారుతున్న చీప్‌లిక్కర్‌ 

మినీ బార్లను తలపిస్తున్న బెల్టు షాపులు

గ్రామాలకు పాకుతున్న  మద్యం మాఫియా 

షరా‘మామూలే’ అంటున్న ఎక్సైజ్‌ అధికారులు 

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం : నిండు వర్షాకాలంలో మంచి నీటి ఎద్దడి ఎదుర్కొనే పల్లెలు ఉండొచ్చేమో గాని.. మద్యానికి మాత్రం ఎలాంటి కొదువ లేదు. రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపుతూ.. పెద్దఎత్తున దాడులు చేయిస్తోంది.. వ్యాపారులు, తయారీదారులపై పీడీ యాక్టు అమలుచేస్తోంది. ఫలితంగా సారా తయారీ, అమ్మకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఈ స్థానాన్ని బెల్టు దుకాణాలు ఆక్రమించాయి. ఏ మూల చూసినా అవే దర్శనమిస్తున్నాయి. వీటిపై నియంత్రణ కొరవడడంతో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. కిరాణం, శీతల పానీయాల దుకాణాలు, హోటళ్లు, పాన్‌ డబ్బాల్లో మద్యం వాసన గుప్పుమంటోంది. ఇంత జరుగుతున్నా ఆబ్కారీ, పోలీస్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.  


బెల్టుల సాయంతో అక్రమార్జన 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో బెల్టు దుకాణాల సం ఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మద్యం వ్యాపారులు ఎక్కువ శాతం ఈ దుకాణాలపైనే దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో 66 వైన్స్‌ దుకాణాలుండగా ఒక్కోదానికి సగటున 20 నుంచి 40 బెల్టు దుకాణాలతో సంబంధాలుండటం విశేషం. మరికొంద రు దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి పల్లెల్లో ఇళ్ల దగ్గర, చిన్నపాటి హోటళ్లు, కిరాణ దుకాణాల్లో దర్జాగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మార్పీ పేరుతో బోర్డులు తగిలిస్తున్న వ్యాపారులు బెల్టుల సాయంతో అక్రమార్జనకు తెరలేపుతున్నారు. ప్రతి రోజు వైన్స్‌తో సమానంగా బెల్టు దుకాణాల్లో వ్యా పారం సాగుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకో వచ్చు. జిల్లాలో బెల్టు దుకాణాల ద్వారా నిత్యం రూ.50 లక్షల వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలు స్తోంది. ప్రత్యేకంగా కొన్ని వైన్స్‌ దుకాణాలు ఇదే పనిగా ముందుకు సాగుతున్నాయి. అధికారికంగా డిపో నుంచి సరుకు తెచ్చుకుని రికార్డుల్లో నమో దు చేస్తూ బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు.  


నాసికరం మద్యం..
బెల్టు దుకాణాల్లో అమ్మకాలు నాసిరకం మద్యానికి దారి తీస్తున్నాయి. వైన్స్‌ దుకాణాల నుంచి తీసుకొచ్చిన దానికి దుకాణదారులకు చెల్లించిన దానికంటే అదనంగా రూ.20 నుంచి రూ.30 ధర పెంచి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా సీసాల్లో మద్యాన్ని తొలగించి నీళ్లు కలుపుతున్నారు. బెల్టు దుకాణాల్లో బీర్లు కొనుగోలు చేయాలన్నా అదనంగా రూ.40 చెల్లించాల్సిందే. ఎక్కువ శాతం చీప్‌లిక్కర్‌ తాగే వారి కోసం బెల్టు దుకాణాల్లో కొన్ని బ్రాండ్లను అసలు ధర కంటే అదనంగా రూ.40కి విక్రయాలు సాగిస్తున్నారు. జిల్లాలో సుమారు 2 వేల కంటే ఎక్కువ సంఖ్యలో బెల్టు దుకాణాలు గల్లీగల్లీలో విస్తరించాయి. బెల్టు దుకాణారులకు మద్యాన్ని సరఫరా చేయడంతో సిండికేటు దందా సాగించే వారికి రోజువారీగా సగటున రూ.20 లక్షల ఆదాయం అదనంగా సమకూరుతోందని అంచనా. రూ.లక్షలు వెచ్చించి టెండర్ల ద్వారా దుకాణాలు దక్కించుకున్నందుకు లాభసాటిగా ఉండాలనే తాపత్రయంతో నిలువునా ముంచేస్తున్నారు. మరోపక్క అదనంగా డబ్బులు చెల్లించి బెల్టు దుకాణాలను కొనసాగించినందుకు మాకు లాభం లేకపోతే ఎలా? అనే ధోరణితో బెల్టు దుకాణం నకిలీ మద్యంతో మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. 

లేబుల్స్‌ తొలగించి విక్రయాలు 
ఎక్సైజ్‌ అధికారులు నిబంధనలు మాత్రం బేషుగ్గా ఆదేశిస్తున్నారు. మద్యం సీసాలను ఏ దుకాణానికి ఏ లేబుల్‌తో పంపిణీ చేశారో అధికారికంగా రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. ఆ దుకాణానికి సరఫరా చేసిన సీసాలను అక్కడే విక్రయించాలనే ఆదేశాలు సైతం జారీచేశారు. ప్రత్యేకంగా ఒక్కో దుకాణానికి ఒక్కో కోడ్‌ను కేటాయించారు. ఈ తతంగమంతా మద్యం గొలుసుకట్టు దుకాణాల విస్తరణకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే. ఆచరణలో చూస్తే కేవలం కాగితాలకే ఆ నిబంధనలను పరిమితం చేసి అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా వీధుల్లో మద్యం ఏరులై పారుతోంది. మరో పక్క ఏంచక్కా సీసాలకు ఉన్న లేబుల్స్‌ను తొలగించి విచ్చలవిడిగా బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు.

 
ఎక్కడికక్కడ కూర్చోబెట్టి.. 
గ్రామాల్లో ఎక్కడ పడితే సిట్టింగ్‌ రూంలు అనధికారికంగా కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల పోలీసులు ఏకంగా వైన్స్‌ సిట్టింగ్‌ రూంల వద్ద వాహనాలు తనిఖీ చేసి, బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షలు చేసి కేసులు చేస్తున్నారు. దీంతో మందుబాబులు ప్రధాన మద్యం దుకాణాలను వదిలి గ్రామాల బాట పడుతున్నారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం విక్రయాలకు అనేక నిబంధనలున్నాయి. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు చేపట్టాలి. నిల్వ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి. కంప్యూటరైజ్‌ స్కానింగ్‌ చేయాలి. దీంతో ఏ రకం ఎక్కడి నుంచి ఎంత మొత్తంలో విక్రయించింది తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెద్దమొత్తంలో ఒకేసారి మద్యం విక్రయాలు చేస్తే సంబంధిత దుకాణంపై నిఘా ఉంచుతారు. అయితే జిల్లాలో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదని తెలుస్తోంది. బెల్టు దుకాణాల్లో మద్యంతోపాటు నీటి ప్యాకెట్లు, ప్లాస్టిక్‌ గ్లాసులు సైతం విక్రయిస్తూ అక్కడే మద్యం తాగేలా ప్రోత్సహిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు