ఖరీఫ్‌కు లిస్ట్

14 Aug, 2014 02:08 IST|Sakshi

నల్లగొండ : ఎట్టకేలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎత్తిపోతల పథకాలకు ఖరీఫ్‌లో సాగునీటిని విడుదల చేయనున్నారు. విద్యుత్ కనెక్షన్లు తొలగించిన ఎత్తిపోతల పథకాలకు తిరిగి కనెక్షన్లు పునరుద్ధరించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో రైతుల సమస్యలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఎత్తిపోతల పథకాల కింద రైతులు కూడా ఎన్‌ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించారు. దీంతో స్పందించిన ఎన్‌ఎస్పీ అధికారులు ఎత్తిపోతలకు ఖరీఫ్‌లో సాగునీటి విషయాన్ని నీటిపారుదల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
 
 బుధవారం హైదరాబాద్‌లో ఎన్‌ఎస్పీ సీఈ ఎల్లారెడ్డి, ఎస్‌ఈ సుధాకర్, ఐడీసీ ఎండీ రామకృష్ణారావు, ఈఈ లకా్ష్మరెడ్డితో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమావేశం నిర్వహించి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలు కూడా ఖరీఫ్‌లో నీటిని విడుదల చేయాలని, తొలగించిన విద్యుత్ కనెక్షన్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఎత్తిపోతల పథకాల్లోని మోటార్లు కాలిపోతే మరమ్మతులు సైతం చేయించాలని, ఆధునికీకరణ పనులు కూడా వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలో నల్లగొండ జిల్లాకు వస్తానని, ఆ సమయంలో ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణ పనులు పరిశీలిస్తానని తెలిపారు.
 
 పూర్తి ఆయకట్టుకు సాగునీరు..
 ఇంతకాలంపాటు ఎత్తిపోతల పథకాల రైతులు ఖరీఫ్‌లో సాగునీటి విషయంపై సందిగ్ధంలో ఉన్నారు. ఎడమ కాలువపై జిల్లాలో ఉన్న 41 ఎత్తిపోతల పథకాల కింద 79 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్ధకంగా మారింది. ఎత్తిపోతల పథకాలకు కూడా విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటనతో ఎత్తిపోతల పథకాలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయనున్నారు. కాగా మంత్రి ప్రకటన పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
 సమస్య తీరింది
 ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తారో? లేదో అని ఆందోళన చెందాం. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కనెక్షన్లు కూడా తొలగించడంతో ఆర్థికంగా ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకున్నాం. కానీ, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రైతుల కష్టాలు తెలుసుకుని నీటిని విడుదల చేస్తామని ప్రకటించడం శుభపరిణామం.
 - అనుముల వెంకట్‌రెడ్డి, రైతు, త్రిపురారం
 

మరిన్ని వార్తలు