మంజుల్‌కు ‘గణిత నోబెల్’ | Sakshi
Sakshi News home page

మంజుల్‌కు ‘గణిత నోబెల్’

Published Thu, Aug 14 2014 2:04 AM

మంజుల్‌కు ‘గణిత నోబెల్’

సాక్షి, హైదరాబాద్: గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారంగా భావించే ‘ఫీల్డ్స్ మెడల్’ను భారతీయ సంతతికి చెందిన విద్యావేత్త మంజుల్ భార్గవ సాధించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన కొన్నాళ్లు గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరుగుతున్న అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సదస్సులో ‘ఇంటర్నేషనల్ మేథమెటికల్ యూని యన్(ఐఎంయూ)’ భార్గవకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భార్గవ జామెట్రీలో శక్తివంతమైన నూతన విధానాలను అభివృద్ధి చేశారు. 
 
78 ఏళ్ల అంతర్జాతీయ గణిత సదస్సు (ఐసీడబ్లూ) చరిత్రలో భారతీయ మూలాలున్న శాస్త్రవేత్తకు ఈ పురస్కారం లభించడం ఇదే ప్రధమం. నాలుగేళ్లకోసారి ప్రకటించే ఈ పురస్కారాన్ని భార్గవతో పాటు మరో ముగ్గురు ఎంపికయ్యారు. అలాగే, భారతీయ సంతతికి చెందిన మరో గణిత శాస్త్రవేత్త సుభాష్ ఖోట్‌కు అల్‌గోరిథమ్ డిజైన్స్‌లో నూతన ఆవిష్కరణలకు గానూ ‘రోల్ఫ్ నెవాన్లిన్నా’ పురస్కారాన్ని ఐఎంయూ ప్రకటించింది. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన కూరంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ స్టడీస్‌లో సుభాష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.  ఈ అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సదస్సులో హెచ్‌సీయూ గణిత విభాగం ప్రొఫెసర్లు కుమరేశన్, సుమన్ కుమార్ పాల్గొంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement