గిరిజనేతర రైతులకూ మాఫీ

12 Nov, 2014 01:53 IST|Sakshi

* ఎస్టీ ఎమ్మెల్యేల డిమాండ్‌పై సీఎం సానుకూల స్పందన
* నాలుగు జిల్లాల శాసన సభ్యులు, కలెక్టర్లతో సమీక్ష
* మాఫీకి రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు కావాలని అంచనా

సాక్షి, హైదరాబాద్: గిరిజనేతర రైతులకూ పంట రుణ మాఫీ వర్తింపజేయాలన్న డిమాండ్‌పై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సానుకూలంగా స్పం దించారు. మంగళవారం అసెంబ్లీలో గిరిజన ఎమ్మెల్యేలు, నాలుగుజిల్లాల కలెక్టర్లు, సంబంధి త ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ఏళ్ల తరబడి భూములు సాగు చేస్తున్న గిరిజనేతర రైతులు కూడా ఉన్నారు. అయితే వీరి పేర పట్టాలు కానీ, ఇతర రికార్డులు కానీ ఉండవు. 1/70 యాక్టు మేరకు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల పేరు న అధికారికంగా ఎలాంటి పంట భూములు ఉండవు.
 
 దీంతో వీరంతా రుణ మాఫీ పరిధిలోకి రాకుండా పోయారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ సమస్యను గుర్తించి, ఆయా జిల్లాల కలెక్టర్లను భేటీకి పిలి పించారు. ఆ నాలుగు జిల్లాలకు చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. పంటరుణాలిచ్చిన బ్యాంకులు.. అదే తరహాలో మాఫీ చేయాల్సిందేనని, దీనిపై బ్యాంకర్లను పిలిపించి మాట్లాడాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే ఆర్‌బీఐ అధికారులతో తాను మాట్లాడుతానని పేర్కొన్నట్లు ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేల ద్వారా తెలిసింది. మాఫీకి  రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు.
 
 2009-11 మధ్య కరువు వల్ల బ్యాంకుల్లో రీషెడ్యూలు చేసిన రుణాలను రద్దు చేయాలని, పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న వారికి పట్టాలివ్వాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ సమస్య, రైతుల సమస్యను ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వస్తున్న గొత్తికోయల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఖమ్మం కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకువెళ్లగా.. అటవీ అధికారులతో మాట్లాడతానని చెప్పారు.

>
మరిన్ని వార్తలు