ఇక లోకల్ ఎమ్మెల్సీ

2 Apr, 2015 00:45 IST|Sakshi

అందరిలో అదే చర్చ 
ఎన్నికలప్పటికీ  ఇప్పటికి మారిన బలాలు
అధికార టీఆర్‌ఎస్‌కు   ఆధిక్యం
అభ్యర్థిత్వం కోసం  పోటాపోటీ

 
వరంగల్ :  రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడి ఎన్నిక త్వరలో జరగనుంది. శాసన మండలిలోని ఐదు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఈ స్థానాలతోపాటే మన జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక  జరగనుంది. ప్రస్తుతానికి ఎన్నిక విషయంలో కొంత సందిగ్ధత ఉన్నా.. నెలాఖరు వరకు ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు, రాజకీయ వర్గాలు పేర్కొంటున్నారుు. జిల్లా స్థానిక ఎమ్మెల్సీకి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉం డడంతో ఆశావహులు దీనిపై దృష్టి పెట్టారు. పార్టీల తరుఫున అభ్యర్థిత్వం దక్కించుకునేందుకు నాయకులు కసరత్తు ముమ్మరం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అంటే ఖరీదైన వ్యవహారమనే అభిప్రాయం ఉండడంతో.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న వారే అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీకి సంబంధించి మొదటి నుంచి అధికార పార్టీగా అనుకూలంగా ఉంటోంది.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకునే విషయం కావడంతో వీరి మద్దతు పొందడం అధికార పార్టీకి సులువుగా అయ్యే అంశంగా ఉండనుంది. దీంతో ప్రతిపక్ష పార్టీల కంటే అధికార టీఆర్‌ఎస్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి పోటీ ఎక్కువగా ఉంటోంది. టీఆర్‌ఎస్‌లో ఇప్పటివరకు రాజకీయ అవకాశాలు రాని వారు.. ఇప్పు డు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు సంబంధించి ఎక్కువ మంది ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెట్టుకున్నా రు. టీఆర్‌ఎస్‌లో చేరే సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తనకు అవకాశం దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఉన్నారు. ప్రస్తుతం పదవీ కాలం ముగుస్తున్న బి.వెంకటేశ్వర్లు పేరు స్థానిక సంస్థలకు పరి శీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ద్దరితోపాటు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నాగుర్ల వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రయత్నాల సంగతి ఎలా ఉన్నా.. తమ పార్టీ ఆనవాయితీ ప్రకారం అనూహ్యంగా కొత్త వ్యక్తి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని టీఆర్‌ఎస్ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు సం బంధించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ పడతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన పార్టీలు బరిలో దిగే అవకాశాలు తక్కువే ఉన్నాయి.
 
871 మంది స్థానిక ప్రతినిధులు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. జెడ్పీటీసీ సభ్యు లు, ఎంపీటీసీ సభ్యులు... మున్సిపాలిటీ, నగరపంచాయతీ కౌన్సిలర్లు.. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థలోని 58 డివి జన్లు కలిపి మొత్తం 929 మంది ఓటర్లు ఉన్నారు. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం 871 స్థానాలకు ప్రస్తుతం ప్రతినిధులు ఎన్నికయ్యారు. 2008లో ఏర్పాటైన శాసనమండలికి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తరుఫున గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికయ్యారు. 2009లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో గండ్ర ఈ పదవికి రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ తరుఫున కొండా మురళీధర్‌రావు ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కొండా మురళి ఈ పదవిని వదుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎన్నిక జరగనుంది.
 
 

మరిన్ని వార్తలు