ఆర్టీసీలో నష్టాలు తగ్గుముఖం

23 Dec, 2017 03:50 IST|Sakshi
శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి మహేందర్‌రెడ్డి, చిత్రంలో సోమారపు, రమణారావు

లాభాల బాటలో 23 డిపోలు

59 డిపోల్లో తగ్గిన నష్టాలు

సిటీలో రోజుకు రూ.కోటి నష్టం

సమీక్షా సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీలో నష్టాలు తగ్గుముఖం పట్టాయని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. గత సంవత్సరం రూ.371.17 కోట్ల నష్టాలు నమోదు కాగా, ఈ ఏడాది రూ.340.39 కోట్లు నమోదయ్యాయని చెప్పారు. 23 డిపోలు లాభాల బాటలో నడుస్తుండగా, మరో 59 డిపోల్లో నష్టాలు తగ్గాయని అన్నారు. శుక్రవారం ఇక్కడ బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, ఎం.డి.రమణారావు, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌శర్మలతో కలసి మాట్లాడారు.

ఈ ఏడాది రూ.31 కోట్ల వరకు నష్టం తగ్గిందని, ఆర్టీసీకి రోజుకు రూ.96 లక్షల ఆదాయం లభిస్తోందని వివరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం రోజుకు రూ.కోటి నష్టం వస్తున్నట్లు పేర్కొన్నారు. దశలవారీగా అన్ని డిపోలను లాభాల బాటలో నడిపే విధంగా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం బడ్జెట్‌లో ఆర్టీసీకి కేటాయించిన రూ.1,000 కోట్లలో ఇప్పటి వరకు రూ.600 కోట్లు అందాయన్నారు. బస్‌పాస్‌లు, ఇతర సబ్సిడీల రూపంలో రావలసిన నిధులను త్వరలోనే అందజేసే విధంగా సీఎం కేసీఆర్‌ను కోరనున్నట్లు తెలిపారు. దూరప్రాంతాల బస్సులు లాభాల బాటలోనే నడుస్తుండగా, పల్లెవెలుగు బస్సులు నష్టాలను చవి చూస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని మరో 900 గ్రామాలకు దశలవారీగా రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఏపీ, తెలంగాణల మధ్య సింగిల్‌ పర్మిట్‌ విధానం త్వరలోనే అమల్లోకి వస్తుందన్నారు.

ఏడాదిలో 1,000 కొత్త బస్సులు 
ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఈ ఏడాది 1,000 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి  పేర్కొన్నారు. మేడారం జాతర సందర్భంగా  4,200 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు 23 చోట్ల మినీ థియేటర్‌ల ఏర్పాటుపై వ్యాపారుల నుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. త్వరలోనే ఆర్టీసీ స్థలాల్లో 114 పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటా మని అన్నారు. టీఎస్‌ఆర్టీసీకి రెండు స్కాచ్‌ అవార్డులు లభించడంపట్ల మంత్రి మహేందర్‌రెడ్డి   సంతోషం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు