వీకెండ్‌ జోష్‌

3 Dec, 2017 01:12 IST|Sakshi

సెలవుదినం కావడంతో మెట్రోలో కిక్కిరిసిన రద్దీ

కుటుంబాలతో సహా ప్రయాణం

నాలుగో రోజు 2.10 లక్షల మందికి పైగా జర్నీ

ఎంఎంటీఎస్‌కు వీకెండ్‌ హాల్టింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: సరికొత్త అనుభూతి. నిలువెత్తు నింగిలోంచి ప్రయాణం. రహదారులపై వాహనాల రొదకు దూరంగా... కుదుపులు లేకుండా... ఆకాశంలో హాయ్‌ హాయ్‌గా మెట్రో జర్నీ. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన తొలి వీకెండ్‌ కావడంతో నగరవాసులు శనివారం విపరీతంగా వచ్చారు. నాగోల్‌–మియాపూర్‌ మార్గం పర్యాటక ప్రాంతాన్ని తలపించింది. మెట్రో స్టేషన్‌లు, రైళ్లు  ప్రయాణికుల రద్దీతో పోటెత్తగా... ప్రతి రోజు సుమారు 1.5 లక్షల మందిప్రయాణికులతో పరుగులు పెట్టే ఎంఎంటీఎస్‌ రైళ్లు మాత్రం వీకెండ్‌ హాల్ట్‌తో ఊపిరి పీల్చుకున్నాయి. శనివారం సెలవు దినం కావడంతో ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లలో, రైళ్లలో రద్దీ తగ్గింది. మరోవైపు మెట్రోలో శనివారం 2.10 లక్షల మందికి పైగా ప్రయాణించినట్లు మెట్రో రైలు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్‌ఎంఆర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టేషన్ల వద్ద గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు.  

ఎలాగైనా ప్రయాణించాలి...
వీకెండ్‌ జర్నీ కోసం పిల్లలు, పెద్దలు అంతా కుటుంబాలతో సహా మెట్రో స్టేషన్లకు తరలివచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రో రైల్లో పయనించి తీరాలనే నగరవాసుల కోరిక, పట్టుదలతో రైళ్లు కిక్కిరిసాయి. టికెట్‌ కౌంటర్‌లు, టికెట్‌ వెండింగ్‌ మిషన్‌ల వద్ద జనం బారులు తీరారు. నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌ నగర్, మియాపూర్, తదితర స్టేషన్‌లలో రద్దీ బాగా కనిపించింది. సాధారణ ప్రయాణికుల కంటే సందర్శన కోసం వచ్చిన ప్రయాణికుల రద్దీయే ఎక్కువగా ఉంది. నవంబర్‌ 29 నుంచి మెట్రో నగర ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 29వ తేదీ నుంచి 1వ తేదీ వరకు పనిదినాలు అయినప్పటికీ రోజుకు 2 లక్షల మందికి పైగా పయనించారు. శనివారం ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, తదితర విద్యా సంస్థలన్నింటికీ సెలవు దినం కావడంతో అంతా పోలోమంటూ మెట్రోకు ఉరకలు వేశారు. దీంతో రద్దీ పెరిగింది. నాగోల్‌ నుంచి మియాపూర్‌ నుంచి వచ్చే రైళ్లకు కేంద్రమైన అమీర్‌పేట్‌ ప్రయాణికులతో సందడిగా కనిపించింది. కుటుంబాలతో కలసి మెట్రోకు వచ్చిన చాలామంది సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు.  

బోసిపోయిన ఎంఎంటీఎస్‌...
నగరంలో శనివారం ఒకవైపు మెట్రోరైలు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడగా ఎంఎంటీఎస్‌ రైళ్లు మాత్రం బోసిపోయాయి. సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఎంఎంటీఎస్‌ రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసే చాలా మంది ఉద్యోగులు ఎంఎంటీఎస్‌పైనే ఆధారపడి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. హైటెక్‌సిటీకి రాకపోకలు సాగించే వారి సంఖ్య మెజారిటీగా ఉంటుంది. ఐటీ సంస్థల్లో పని చేసేవారు ఎంఎంటీఎస్‌లో పాస్‌లు తీసుకొని రెగ్యులర్‌గా పయనిస్తున్నారు. రోజుకు సగటున 1.5 లక్షల మంది ప్రయాణికులతో 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. శనివారం సెలవు దినం కావడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్లుగా ఈ రైళ్లు సాధారణ రద్దీతోనే కనిపించాయి.

మరిన్ని వార్తలు