‘మద్దతు'లేక రైతన్న దిగాలు

28 Sep, 2014 03:35 IST|Sakshi
‘మద్దతు'లేక రైతన్న దిగాలు

జడ్చర్ల:
 ఈ ఏడాది పంట ఉత్పత్తులకు మంచిధరలు ఉంటాయని ఆశించిన రైతులకు భంగపాటు ఎదురైంది. ప్రభుత్వం 2014-15 సంవత్సరానికి ప్రకటించిన మద్దతుధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు సాగుఖర్చులు పెరగడం.. మరోవైపు గిట్టుబాటు ధరలు కూడా దక్కకపోవడంతో ఈ ఏడాది కూడా అప్పులబాధ తప్పేలాలేదని రైతులు కలవరపడుతున్నారు. జిల్లాలో ప్రధానంగా ఈ ఏడాది మొక్కజొన్న పంటను 1.53 లక్షల హెక్టార్లలో సాగుచేశారు. పత్తి 2.15 లక్షల హెక్టార్లు, 96,350 హెక్టార్లలో వరిపైరును సాగుచేశారు. అయితే ప్రధాన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలు ఆశించినస్థాయిలో లేవు. గతేడాదితో పోలిస్తే పత్తి క్వింటాలుకు కేవలం రూ.50మాత్రమే పెరిగిది. మొక్కజొన్నకు ఈ ఏడాది ధరను పెంచకపోగా..పాతధర రూ.1310 కొనసాగిస్తున్నారు. అదేవిధంగా రబీలో ప్రధానంగా సాగుచేసే వేరుశనగకు కూడా పాతధర క్వింటాలుకు రూ.4వేలు చెల్లిస్తున్నారు. వరికి మాత్రం కంటితుడుపుగా రూ.90 పెంచారు. కందులకు క్వింటాలుకు రూ.50, పెసర్లకు మాత్రం రూ.100 చొప్పున పెంచారు.
 పెరిగిన సాగుఖర్చులు
 ఈ ఏడాది సాగుఖర్చులు గణనీయంగా పెరిగాయి. సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు రెండుమూడుసార్లు విత్తారు. విత్తనాలకు రూ.నాలుగు నుంచి ఆరువేలు, దుక్కిదున్నడానికి రూ.రెండువేలు, యూరియాకు రూ.ఐదువేలు, పురుగుమందుల కోసం మరో రూ.ఆరువేలు, విత్తనాలు విత్తేందుకు, కలుపుతీత పనులకు ఐదువేలు ఖర్చయింది. ఇలా పత్తిసాగుకు ఎకరాకు రూ.30 నుండి రూ.40వేల వరకు ఖర్చుచేశారు. అయితే ఎకరాకు 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే గిట్టుబాటు అవుతుందని, ప్రస్తుతం ఎకరాకు 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలపై పెదవివిరుస్తున్నారు. సాగుఖర్చులు తడిసిమోపెడయ్యాయని, మరోవైపు విద్యుత్‌చార్జీల భారం ఉండనే ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. పత్తి క్వింటాలుకు రూ.6వేలు, మొక్కజొన్నకు రూ.1800, వరికి రూ.1800 నుంచి 2000 చెల్లించాలని కోరుతున్నారు.


 

మరిన్ని వార్తలు