అన్ని కులాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ

4 Dec, 2017 03:01 IST|Sakshi

కురుమ సంఘ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని కులాలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సిద్ధిస్తుందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ అన్ని కులాలకు రూ. 4 వేల కోట్ల నిధులు కేటాయించి రికార్డు సృష్టించారని అన్నారు. మండలంలోని అలియాబాద్‌ చౌరస్తా మల్లారెడ్డి గార్డెన్స్‌లో ఆదివారం జంట నగరాల కురుమ సంఘం 39వ దసరా–దీపావళి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గి మల్లేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కురుమ, గొల్ల, యాదవుల సంక్షేమం, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లతో గొర్రెలను అందిస్తుందన్నారు.

రాష్ట్రంలోని ఒక్కో కులానికి హైదరాబాద్‌లో రూ. 10 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో సంక్షేమ భవనాలు నిర్మించడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు. కర్ణాటక రవాణా శాఖ మంత్రి హెచ్‌.ఎం.రేణప్ప మాట్లాడుతూ.. కులాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కురుమల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్‌తో జరుగుతున్న బీసీ సంక్షేమ సమావేశంలో కురుమల సమస్యలు, రిజర్వేషన్, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తానని అన్నారు.

ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్లలో యాదవ, గొల్లలతో పోలిస్తే కురుమలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమ్మేళనంలో ఒగ్గు కళాకారులు, మహిళలు పలు ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్, కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బి.చంద్ర«శేఖర్‌ యాదవ్, పటాన్‌చెరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుష్ప నాగేశ్, కార్పొరేటర్లు కన్న చైతన్య, రావుల విజయ జంగయ్య, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం మహిళా అధ్యక్షురాలు దయ్యాల బాలమణి, కురుమ సంఘం జంటనగరాల అధ్యక్షుడు నారాయణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నక్క ప్రభాకర్‌గౌడ్, తెలంగాణ ఒగ్గు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు