ఎక్స్‌.. వై.. @ స్ట్రేంజర్‌!

31 Jan, 2020 08:47 IST|Sakshi

చాటింగ్‌ యాప్‌ ద్వారా అసభ్యకర చాట్స్‌  

యువతి పేరిట యువకుడి చాటింగ్‌    

‘నమ్మకం’ కోసం స్నేహితురాళ్ల ఫొటోలు షేర్‌

ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చిన సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో: చాటింగ్‌ యాప్‌ స్ట్రేంజర్‌లో విశృంఖలత్వం రాజ్యమేలుతోంది. ఈ యాప్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమైన నగరానికి చెందిన ‘ఎక్స్‌’, ‘వై’ చాటింగ్‌ చేసుకున్నారు. తాను యువతినంటూ వై, ఎక్స్‌తో చెప్పాడు. అది నమ్మించడం కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో ఉన్న తన స్నేహితురాలైన ‘జెడ్‌’ ఫొటోలు షేర్‌ చేశారు. తన ఫొటోలు షేర్‌ అయిన విషయం ఎక్స్‌ ద్వారా తెలుసుకున్న జెడ్‌.. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు గురువారం ఎక్స్, వైలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి తీవ్రంగా మందలించారు. కొన్నాళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన స్ట్రేంజర్‌ యాప్‌ను అనేక మంది తమ స్మార్ట్‌ఫోన్లలోకి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఆపై నాక్‌మే వాస్తేగా లాగిన్‌ అయి చాటింగ్స్‌ చేస్తున్నారు. ఇందులో చాట్‌ చేయడానికి ఒకరికి మరొకరు తెలిసి ఉండటం, పరిచయం అవసరం లేదు. దీంతో ఈ యాప్‌లో విశృంఖలత్వం వీరవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన ఓ విద్యా సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎక్స్‌కు స్ట్రేంజర్‌ ద్వారా విద్యార్థి అయిన వైతో పరిచయం ఏర్పడింది.

తాను యువతినంటూ చెప్పుకొన్న వై.. ఎక్స్‌తో అభ్యంతరకరంగా, అసభ్యంగా చాటింగ్‌ చేశాడు. ఓ దశలో ‘నీ ఫొటోలు పంపించు’మంటూ ఎక్స్‌ కోరడంతో ఏం చేయాలని ఆలోచనలో పడ్డాడు. చివరకు క్లాస్‌మేట్‌ అయిన విద్యార్థిని ‘జెడ్‌’ ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతా వినియోగించాలని నిర్ణయించుకున్నాడు. అందులో నుంచి ఆమె ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసిన వై.. వాటిని ఎక్స్‌కు షేర్‌ చేస్తూ, అభ్యంతరకరమైన చాటింగ్‌ కొనసాగించాడు. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న ఆ యువతి ‘జెడ్‌’ ఓ స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా పని చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆమె ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌లో ఉన్నాయి. ఓ దశలో వీటిని సంగ్రహించిన వై.. స్ట్రేంజర్‌ యాప్‌ ద్వారా ఎక్స్‌కు పంపించాడు. ఆ ఫొటోలో సదరు స్వచ్ఛంద సంస్థ పేరును చూసిన ఇతగాడు కొన్ని ప్రయత్నాలు చేసి జెడ్‌ను సంప్రదించాడు. ఈ నేపథ్యంలో తనతో చాటింగ్‌ చేస్తోంది ఆమె కాదని, ఫొటోలను వై దుర్వినియోగం చేసినట్లు గుర్తించి ఆమెకు సమాచారం ఇచ్చాడు.

దీంతో జెడ్‌ ఈ నెల 17న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలు విజ్ఞప్తి మేరకు అధికారులు సాంకేతికంగా వైని కనిపెట్టారు. గురువారం బాధితురాలితో పాటు ఎక్స్, వైలను సైబర్‌ ఠాణాకు తీసుకువచ్చారు. వారి భవిష్యత్, కుటుంబ నేపథ్యాలను దృష్టిలో పెట్టుకున్న బాధితురాలు తదుపరి చర్యలు వద్దని, కౌన్సెలింగ్‌తో పాటు వార్నింగ్‌ ఇచ్చి బైండోవర్‌ చేయమని కోరారు. దీంతో అధికారులు ఇద్దరినీ మందలించడంతో పాటు పునరావృతం కాదంటూ లిఖితపూర్వకంగా హామీ తీసుకుని పంపారు. మహిళలు, యువతులు సోషల్‌మీడియాలో తమ వ్యక్తిగత ఫొటోలు పెడితే ఇలా దుర్వినియోగం అవుతుందని, కొన్నిసార్లు అసభ్యంగా మార్ఫింగ్‌కు గురవుతాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. విద్యార్థులు సైతం ఇలాంటి యాప్స్‌లో పడి తమ భవిష్యత్తును కాలరాసుకోవద్దని సూచిస్తున్నారు. ఈ తరహా యాప్స్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిఘా ఉంచాలని నిర్ణయించారు.

>
మరిన్ని వార్తలు