ఆస్పత్రిలో శిశువులు తారుమారు 

26 Jun, 2018 01:45 IST|Sakshi

డీఎన్‌ఏ పరీక్ష కోసం అధికారుల ఆదేశాలు  

పటాన్‌చెరు టౌన్‌: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన శిశువులు తారుమారైన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. పటాన్‌చెరు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వసుంధర, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని జిన్నారం మండలం అండూర్‌ గ్రామానికి చెందిన శ్రీశైలం తన భార్య అర్చనను కాన్పుకోసం కోసం శనివారం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బొల్లారం గ్రామానికి చెందిన రమేశ్‌ గౌడ్‌ భార్య సరస్వతినీ ప్రసవం కోసమే చేర్పించారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం డెలివరీ కోసం సరస్వతి, అర్చనను ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ముందుగా సర్వసతికి డెలివరీ చేయగా బాబు పుట్టాడు. అయితే వార్డుబాయ్‌ సరస్వతికి పుట్టిన బాబును పొరపాటున అర్చన కుటుంబీకులకు అందజేశాడు. కాసేపటి తర్వాత అర్చనకు పాప పుట్టింది. పాపను అర్చన కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు తీసుకెళ్లగా జరిగిన పొరపాటు తెలిసింది. వైద్యాధికారులు కుటుంబ సభ్యులతో చర్చించి శిశువులు ఇద్దరికీ డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. పరీక్షల అనంతరం శిశువులను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని వైద్యులు తెలిపారు.  

>
మరిన్ని వార్తలు