మగాళ్ల నుంచే మార్పు రావాలి

30 Nov, 2017 03:14 IST|Sakshi

జీఈఎస్‌లో మిస్‌ వరల్ట్‌ మానుషీ ఛిల్లర్‌

జీఈఎస్‌ చర్చాగోష్టిలో ప్రపంచ సుందరి మానుషీ

మహిళలు తమకంటే తక్కువ కాదని ఆలోచించాలి

అప్పుడు స్త్రీలు కూడా అలాగే ఆలోచిస్తారు

ఈ హోదా సమాజానికి సేవ చేసే అవకాశాన్నిచ్చింది

భవిష్యత్తులో సినిమా నటిని అవ్వొచ్చేమో..

సాక్షి, హైదరాబాద్‌: మోముపై చిరునవ్వు.. మాటల్లో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. ఎలాంటి ప్రశ్నకైనా ఠక్కున సమాధానం చెప్పే నేర్పరితనం.. అందర్నీ కట్టిపడేసే అందం.. ఆమెవరో కాదు.. 20 ఏళ్లకే ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషీ ఛిల్లర్‌! 17 ఏళ్ల తర్వాత మన దేశానికి ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టిన ఈ హరియాణా అందాల సుందరి బుధవారం ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో ‘సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌’గా నిలిచింది.

బంగారు వన్నె దుస్తులతో హెచ్‌ఐసీసీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ఛిల్లర్‌.. మహిళా సాధికారతపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొంది. ఎలాంటి ప్రశ్న అడిగినా ఫటాఫట్‌ సమాధానమిస్తూ అందర్నీ ఆకట్టుకుంది! ‘మీరు మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలిచారు కదా.. గెలవడమే అంతిమమా...’ అని కార్యక్రమ నిర్వాహకుడు ప్రశ్నించగా.. ‘మార్పు అంతిమం (చేంజ్‌ ఈజ్‌ ఎవ్రీథింగ్‌)’ అని సమాధానమిచ్చింది. ‘ముందు డాక్టర్, ఆ తర్వాత మిస్‌వరల్డ్‌ కదా. మీ జీవితంలో దేన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటారని అడగ్గా.. ‘నా జీవితంలో అవి రెండూ ఒకటే. ముందు డాక్టర్‌ని. తర్వాత అందాల సుందరిని. భవిష్యత్‌లోనూ డాక్టర్నే..’ అని పేర్కొంది. వివిధ అంశాలపై ఆమె అంతరంగం ఇదీ..

ఈ కిరీటం.. సేవకు అవకాశం
మిస్‌వరల్డ్‌ అనేది సమాజానికి నేను కొంత తిరిగి ఇచ్చేందుకు సేవ చేసే అవకాశంగా భావిస్తా. అది నాకు గౌరవం కూడా. నాలాంటి యువతులకు ఈ హోదా చాలా నేర్పుతుంది. ఎన్నో చోట్ల తిరగాల్సి వస్తుంది. సెలబ్రిటీల నుంచి చిన్నపిల్లల వరకు అందరితో మమేకం అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నో నేర్చుకుంటాం. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడం నా బాధ్యత.

చిరునవ్వుతోనూ మార్పు
ఏ పనయినా నాతో కాదు అన్న భావన రాకూడదు. ప్రతి ఒక్కరూ మార్పు తీసుకురాగలరు. ఓ చిరు నవ్వు కూడా పరిస్థితిలో మార్పు తెస్తుంది. గుడ్‌ మార్నింగ్‌ అంటూ పలకరించడం కూడా ఎదుటి వారిలో మనపై అభిప్రాయాన్ని మారుస్తుంది. ఎదుటివారిని సంతోషపరిస్తే మనల్ని కూడా వారు సంతోషపరిచేందుకు ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరికీ సమాజంలో మార్పు తెచ్చే అవకాశం ఉంది. మార్పు తెచ్చేందుకు మిస్‌ వరల్డే కానక్కర్లేదు.

ఉన్నదంతా మీ తలలోనే..
ప్రతి ఒక్కరికీ జీవితంలో సవాళ్లు ఎదురవుతుం టాయి. అయితే వాటిని ఎలా ఎదుర్కొంటారనేదే సమస్య. ఓ మహిళ వ్యాపారవేత్తగా ఎదగాలంటే అంతా మీ మైండ్‌సెట్‌ మీద, అందులోని ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది.

డాక్టర్‌.. యాక్టర్‌ కూడా..
నాపై కుటుంబ ప్రభావం ఉంది. మాది డాక్టర్ల ఫ్యామిలీ కావడంతో ఆ ప్రభావం నాపై పడటం వల్లే నేను కూడా డాక్టర్ని అయ్యాననుకుంటా. ఆదివారం పూట నా తల్లి వ్యవహరించే తీరును నిశితంగా గమనించేదాన్ని. డాక్టర్‌ డాక్టరే కాదు.. యాక్టర్‌ కూడా అని నాన్న చెప్పేవారు. ఎందుకంటే.. ఏమీ కాదంటూ రోగి ముందు నటించినా ఆ రోగి చాలా వరకు కోలుకుంటాడు.

పనిని ప్రేమిస్తా..
వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం నిజంగా పెద్ద బాధ్యతే. కానీ నేను చేస్తున్న పనిని ప్రేమిస్తాను. చేసే పనిని మీరు ప్రేమించినప్పుడు ఒత్తిడి అనిపించదు. అందుకే ఆ హోదా నాకు బాధ్యతే కానీ.. ఒత్తిడి ఏ మాత్రం కాదు.

మహిళకు మహిళ తోడుండాలి
ఒక మహిళ ఎదిగేందుకు మరో మహిళ తోడ్పాటు నివ్వాలి. మహిళల్లో అవగాహన లేమితో పాటు అను కూలతలు లేకపోవడం వల్ల కూడా రాణించలే కపోతున్నారు. అందుకే కొన్ని అవకాశాలను వారికి కల్పించాలి. ఆ కోణంలోనే రుతుక్రమంలో పాటిం చాల్సిన శుభ్రత గురించి ఆలోచించి ఓ కంపెనీ ఏర్పాటు చేశా. స్థానిక వ్యాపారులతోపాటు వాల్‌మా ర్ట్‌ లాంటి సంస్థతో కూడా అనుసంధానమయ్యాం. దాదాపు ఉత్తర భారతదేశమంతా శానిటరీ నాప్‌కిన్స్‌ ను మా కంపెనీ అందిస్తుంది. దీంతో 20 గ్రామా ల్లోని మహిళలు ఉపాధి పొందుతున్నారు. వారు కూడా పారిశ్రామికవేత్తలవుతున్నారు. చాలా దేశాల్లో 50 శాతానికిపైగా పౌరులు పేదరికంలో బతుకుతు న్నారు. వారికి ఆరోగ్య సదుపాయాలు అందడం లేదు. అందరికీ ఆరోగ్య సదుపాయాలు కల్పించ డమే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించుకున్నా.

ఏమో...అవుతానేమో..?
నేను మిస్‌వరల్డ్‌ అయిన తర్వాత చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నా. దేనిపైనా దృష్టి పెట్టలేదు. సినిమా అవకాశమనేది చాలా ఆసక్తి కలిగిస్తుంది. సినీ జీవితం నా జీవితంలో కూడా ఉండొచ్చేమో. ఇప్పటికైతే అది నా ప్రాధాన్యతల్లో లేదు.

‘అమ్మ’ భావనే అద్భుతం
అమ్మతనం చాలా అందమైంది. ఆ అనుభవం అమ్మ అయిన ప్రతి మహిళకూ సంతోషమే. ఓ జీవితానికి రూపం ఇవ్వడం.. ఓ స్నేహితుడిని సంపాదించుకునే అవకాశం గొప్ప ది. తల్లీబిడ్డల మధ్య సంబంధం ఇవ్వడం, తీసు కోవడమే కాదు. అదో మ్యాజిక్‌. అద్భుతం. అమ్మ ఎప్పుడూ నన్ను ప్రేమిస్తుంది. నేను స్టేజీ మీద ఉండి ఆమె ప్రేక్షకుల్లో ఉన్నప్పుడు ఆమె కళ్లలో గర్వం నాకు కనిపించింది. అదో అద్భుత అనుభూతి. అమ్మకు రుణపడి ఉంటా.

భారతీయురాలిని కాబట్టే..
భావ వ్యక్తీకరణ నైపుణ్యం చాలా ముఖ్యం. నేను డాక్టర్‌ని కాబట్టి పేషెంట్లతో కమ్యూనికేషన్‌ బాగుండాలి. అప్పుడే విషయం సులువవుతుంది. మనం ఏం మాట్లాడుతున్నామనే దాన్ని మనం నమ్మాలి. ఫీలవ్వాలి. అందుకే భాషా అడ్డంకులను అధిగమించి ప్రపంచ పోటీల్లో 118 మంది అందాల యువతులను ఓడించగలిగాను. భావోద్వేగం అనేది భావవ్యక్తీకరణకు ముఖ్యం. నేను భారతీయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఆ వేదికపై భావోద్వేగంతో నా భావాలను వ్యక్తపర్చగలిగా.

మగాళ్లతోనే ప్రారంభం కావాలి
ఇది సమాన ప్రపంచం. ఇక్కడ పురుషులు, స్త్రీలు అందరూ సమానమే. వేతనాల్లోనూ, అవకాశాల్లోనూ ఇద్దరికీ తగిన అవకాశాలుండాలి. పురుషాధిక్య సమాజంలో మార్పు రావాలంటే ముందు పురుషుడి ఆలోచనలో మార్పు రావాలి. స్త్రీలు తమకంటే ఎందులోనూ తక్కువ కాదని పురుషులు ఆలోచిస్తే అప్పుడు తాము తక్కువ కాదని స్త్రీలు ఆలోచించడం మొదలు పెడతారు. నాకెప్పుడూ అసమానత ఎదురుకాలేదు.

క్రీడలకు స్టార్టప్‌లు సాహసోపేతమే
క్రీడలు, ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్‌ మారు పేరు. నగరంలో అందుబాటులో ఉన్న వ్యవస్థ, సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో క్రికెట్, టెన్నిస్, బ్యాట్మింటన్‌లాంటి క్రీడల్లో హైదరాబాదీలు అంతర్జాతీయ స్థాయికి ఆడుతున్నారు. నగరంలో ఈ మెగా ఈవెంట్‌ జరగడం మనందరికీ గర్వకారణం. క్రీడలను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర, యువ క్రీడాకారులు కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొనే సమస్యలు, స్పాన్సర్‌షిప్‌లపై చర్చాగోష్టిలో మాట్లాడాం. క్రీడా రంగానికి సంబంధించిన స్టార్టప్‌ల ఏర్పాటు అత్యంత సాహసోపేతమైన చర్య. కచ్చితత్వం ఉండదు. క్రీడారంగంలో వ్యాపారం ఓ జూదం లాంటిది. – మిథాలీరాజ్, భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌

మరిన్ని వార్తలు