‘ఆక్వా’ ఆందోళనపై పోలీసుల జులుం

30 Nov, 2017 02:56 IST|Sakshi
ఆందోళన చేస్తున్న మహిళను ఈడ్చుకెళ్తున్న పోలీసులు

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు పరిసర ప్రాంత రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను ఈడ్చుకెళ్లి వాహనాల్లో కుక్కివేశారు. మహిళా రైతులను శిబిరం నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఆక్వాఫుడ్‌ పార్కుకు వ్యతిరేకంగా ఆక్వాఫుడ్‌పార్క్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగర్వు గ్రామాల రైతులు బుధవారం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. అలంకార్‌ సెంటర్‌లోని ధర్నాచౌక్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.

ధర్నాచౌక్‌నుంచి రోడ్డుపైకి వస్తే అరెస్ట్‌ చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. ఆ సమయంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అసెంబ్లీకి వెళతామంటూ శిబిరం  నుంచి బయల్దేరిన రైతులను పోలీసులు అడ్డుకుని, అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళన కారులకు మధ్య జరిగిన తోపులాటలో మహిళలకు గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు