మావోయిస్టు గ్రామ కమిటీ లొంగుబాటు

1 Jun, 2020 11:37 IST|Sakshi
లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కుర్నపల్లి గ్రామ కమిటీ సభ్యులు

గ్రామస్తులకు అన్నివిధాలా సహకారం అందిస్తామన్న ఏఎస్పీ

భద్రాద్రి కొత్తగూడెం, చర్ల: మండలంలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న కుర్నవల్లి గ్రామ పంచాయితీకి మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీకి చెందిన ఆరుగురు సభ్యులు ఆదివారం చర్ల పోలీస్‌ స్టేషన్‌లో భద్రాచలం ఏఎస్పీ రాజేశ్‌చంద్ర ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాజేశ్‌చంద్ర మాట్లాడుతూ మావోయిస్టుల వల్ల ప్రజలకు జరిగే లాభం ఏమీ లేదని, వారి వల్ల ప్రజలకు అన్ని విధాలుగా నష్టాలే జరుగుతుండటంతో గ్రామస్తులంతా ఏకమై గ్రామంలోని మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. సుమారు 200 కుటుంబాల వారు కలిసి గ్రామ కమిటీని రద్దు చేశారని, ఈ కమిటీలో కోరం నాగేశ్వరరావు, కొమరం రమేశ్, సోందె రమేశ్, కోరం సత్యం, ఇర్పా వెంకటేశ్వర్లు, వాగే కన్నారావు ఉన్నారని పేర్కొన్నారు.

మావోయిస్టులకు ఎట్టి పరిస్థితిల్లోనూ సహకరించబోమని స్పష్టమైన హామీ ఇచ్చిన కుర్నపల్లి గ్రామస్తులకు పోలీసు శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి గ్రామ కమిటీని రద్దు చేయడంతో పాటు ఇక నుంచి తామంతా ఐక్యంగా ఉండి మావోయిస్టులకు సహకరించబోమని ప్రకటించడం యావత్‌ రాష్ట్రంలోనూ సంచలమన్నారు. కుర్నపల్లి గ్రామస్తులను మిగిలిన అన్ని గ్రామాల వారు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చర్ల సీఐ తాళ్లపల్లి సత్యనారాయణ, సీఆర్‌పీఎఫ్‌ 141 బెటాలియన్‌ డీఎస్పీ ఎస్‌కే మండల్, ఎస్సైలు వెంకటప్పయ్య, రాజువర్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా