‘మార్కెట్’ చైర్మన్లకు మళ్లీ షాక్

16 Feb, 2015 03:13 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ :మార్కెట్ కమిటీల విషయంలో గత పాలకవర్గాలకు, ప్రభుత్వానికి మధ్య దోబూచులాట కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కారు హయాంలో కొనసాగిన పాలక వర్గాలను రద్దు చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. తమ పదవీ కాలం పూర్తి కాకముందే పదవి నుంచి ఎలా తొలగిస్తారని కొన్ని మార్కెట్ కమిటీల చైర్మన్లు అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పు నివ్వడంతో తిరిగి చైర్మన్లుగా బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా మళ్లీ ఈ పాలక వర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ కమిటీలకు మళ్లీ పర్సన్ ఇన్‌చార్జిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నియమితులైన ఈ పర్సన్ ఇన్‌చార్జిలు ఉన్న ఫలంగా బాధ్యతలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు శని, ఆదివారాల్లో పదవీ బాధ్యతలు తీసుకున్నారు.
 
 13 కమిటీలకు..
 జిల్లాలో మొత్తం 17 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో నాలుగు కమిటీలు ఇంద్రవెల్లి, జైనూర్, బెల్లంపల్లి, భైంసా కమిటీలకు కాంగ్రెస్ హయాంలో కూడా పాలకవర్గాలు లేవు. మిగిలిన 13 మార్కెట్ కమిటీలకు కాంగ్రెస్ నేతలు చైర్మన్లుగా కొనసాగారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సంజీవరెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా విఠల్, ఇచ్చోడకు తిరుమల్‌గౌడ్, నిర్మల్‌కు తక్కల రమణారెడ్డి, సారంగపూర్‌కు రాజేశ్వర్, ఖానాపూర్‌కు అలెగ్జాండర్, కుబీర్‌కు చంద్రశేఖర్, లక్సెట్టిపేట్‌కు కొత్త సత్తయ్య, మంచిర్యాలకు కమలాకర్‌రావు, చెన్నూరుకు జుల్ఫేఖార్ అహ్మద్, కాగజ్‌నగర్ నర్సింగ్‌రావు, ఆసిఫాబాద్‌కు మునీర్ అహ్మద్, బోథ్‌కు ఎం.సత్యనారాయణలు కొనసాగారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ చైర్మన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరంతా కోర్టును ఆశ్రయిం చగా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు వీరంతా గత మూడు నెలలుగా చైర్మన్ బాధ్యతల్లో కొనసాగుతూ వచ్చారు. మళ్లీ ఈ పాలక వర్గాలను రద్దు చేయడంతో మార్కెట్ కమిటీల్లో పర్సన్ ఇన్‌చార్జిల పాల న కొనసాగనుంది. మళ్లీ పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరోమా రు పదవులు కోల్పోయిన చైర్మన్లు తిరిగి కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
 
 పర్సన్ ఇన్‌చార్జిలు వీరే..
 ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పర్సన్ ఇన్‌చార్జిగా మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరైక్టర్ సుధాకర్‌ను నియమించింది. మంచిర్యాల, బోథ్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీలకు డెప్యూటీ డెరైక్టర్ అశోక్ నియమితులయ్యారు. ఇచ్చోడ, జైనథ్, ఖానాపూర్, లక్సెట్టిపేట్, కుభీర్, సారంగాపూర్, నిర్మల్, చెన్నూరు, కాగజ్‌నగర్‌లకు అసిస్టెంట్ డెరైక్టర్ శ్రీనివాస్ పర్సన్ ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా పాలకవర్గాలు లేని భైంసా మార్కెట్ కమిటీ ఇన్‌చార్జిగా జేడీ కొనసాగనున్నారు. జైనూర్, ఇంద్రవెల్లి, బెల్లంపల్లిలకు ఏడీ శ్రీనివాస్ ఇప్పటికే పర్సన్ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.
 

మరిన్ని వార్తలు