దొంగను పట్టించిన ‘ఫేస్‌బుక్’ | Sakshi
Sakshi News home page

దొంగను పట్టించిన ‘ఫేస్‌బుక్’

Published Mon, Feb 16 2015 1:14 PM

దొంగను పట్టించిన ‘ఫేస్‌బుక్’ - Sakshi

* వీడియో చూసి దొంగను గుర్తించిన స్థానికుడు
* నాలుగు పంచలోహ విగ్రహాల స్వాధీనం

నల్లకుంట: ఫేస్‌బుక్ ఓ దొంగను పట్టించింది. ఆలయంలో జరిగిన చోరీ దృష్యాన్ని పోలీసులు పేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయగా, దానిని చూసిన ఓ వ్యక్తి.. దొంగను గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరెస్టు చేశారు. సదరు దొంగ నుంచి సుమారు రూ. 2 లక్షల విలువైన 4 పంచలోహ విగ్రహాల ను స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం నల్లకుంట ఠాణాలో కాచిగూడ ఏసీపీ సీహెచ్ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం...సికింద్రాబాద్‌కు చెందిన పోలపల్లి శ్రీనివాస్(48) వీఎస్టీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కంపెనీ లాక్‌అవుట్ కావడంతో కూలీ పనులు చూసుకుంటూ  రాంనగర్ గుండు సమీపంలో నివాసముంటున్నాడు. మద్యంతో పాటు జల్సాలకు అలవాటుపడిన శ్రీనివాస్ ఆలయాల్లో విగ్రహాల చోరీ ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. 2010లో చిలకలగూడ పోలీసులకు చిక్కి జైలుకెళ్లి వచ్చాడు.  

గతనెలలో అడిక్‌మెట్ ఫ్లైఓవర్ సమీపంలోని ఆలయానికి వెళ్లిన శ్రీనివాస్ అక్కడ అర్చకుడు లేని సమయంలో అడుగు ఎత్తుగల  పంచలోహ విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. ఆ గుడిలోని సీసీ కెమెరాల్లో లభించిన ఫుటేజీని నల్లకుంట ఇన్‌స్పెక్టర్ ఫేస్ బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోను చూసిన ఓ వ్యక్తి గుడిలో చోరీ చేసింది రాంనగర్ గుండులో ఉండే శ్రీనివాస్ అని పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఆదివారం అతడిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా నల్లకుంట పీఎస్ పరిధిలోని రెండు గుళ్లల్లో రెండు పంచలోహ విగ్రహాలు, మరో రెండు చోట్ల రెండు విగ్రహాలు చోరీ చేసినట్టు వెల్లడించాడు.  

చోరీ చేసిన విగ్రహాలను అమ్మిపెట్టాలని రాంనగర్‌లో స్క్రాప్ దుకాణం నిర్వహించే చికోటి యాదగిరి(20) ద్వారా పార్శిగుట్టలో మెటల్ షాప్ నిర్వహిస్తున్న దుర్గం కిషోర్(34)కు అందజేశానని తెలిపాడు. ఈ సమాచారంతో యాదగిరి, కిషోర్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద ఉన్న సుమారు రూ. 2 లక్షల విలువైన నాలుగు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.  శ్రీనివాస్‌తో పాటు చోరీ సొత్తును విక్రయించేందుకు యత్నించిన యాదగిరి, కిషోర్‌లపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వి.జయపాల్‌రెడ్డి, అడిషనల్ ఇన్‌స్పెక్టర్ సైదా, క్రైం ఎస్సై మహేందర్‌రెడ్డి, ఎసై చిరంజీవిని ఆయన అభినందించారు.

Advertisement
Advertisement