ప్రతిభకు మార్కులు కొలమానం కాదు

9 Dec, 2017 03:40 IST|Sakshi

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి

సాక్షి, సిద్దిపేట: విద్యార్థుల ప్రతిభకు మార్కులే కొలమానంగా పెట్టి చూడటం సరికాదని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, ప్రముఖకవి నందిని సిధారెడ్డి అన్నారు. కేరింగ్‌ సిటిజన్స్‌ కలెక్టివ్‌ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన బాల ప్రతిభా మేళా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ప్రతీ విషయంపై అవగాహన కలిగించేలా చూడాలని, అందుకు ముందుగా వారు ఉపాధ్యాయుడు చెప్పిన విషయాన్ని వినేలా ప్రోత్సహించాలని చెప్పారు.

బట్టీ పట్టించడం, మార్కులు ఎక్కువగా వస్తే తెలివైన విద్యార్థిగా చిత్రీకరించడం సరికాదన్నారు. విద్యార్థుల మనసులో మెదిలే ప్రతీ ఆలోచన బహిర్గతం చేసేలా స్వేచ్ఛనివ్వాలని,  తప్పొప్పులను చెప్పి నూతన ఆవిష్కరణలకు దోహదపడేలా ప్రోత్సహిం చాలన్నారు. తనకు చిన్నప్పుడు పాటలంటే ఇష్టమని, కానీ వాటిని పాడటం కష్టంగా ఉండేదని, పాటలు రాసి ఇతరులు పాడితే సంతోషపడ్డానని అన్నారు.

సీఎం కేసీఆర్‌ చిన్ననాటి నుంచి ఉపన్యాస పోటీల్లో ముందుండే వారని, అదే ఆయనను మంచి వక్తగా మార్చి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచేందుకు దోహద పడిందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రం ముస్తాబవుతున్న తరుణంలో ఇటువంటివి నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కేరింగ్‌ సిటిజన్స్‌ కలెక్టివ్‌ డైరెక్టర్‌ సజన, కవి సీతారాం, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు