ముద్దులొలికే చిన్నారి.. ఎవరికి చెందాలి?

26 Oct, 2017 18:46 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ఒకవైపు పేగు బంధం, మరో వైపు పెంచిన మమకారం. పేగు తెంచుకుని పుట్టిన వెంటనే కన్నకూతురిని మరొకరికి పెంపకానికి ఇచ్చిన తల్లి మనసు తల్లడిల్లింది. తప్పు తెలుసుకుని కన్నబిడ్డను తిరిగి తెచ్చుకునేందుకు పోలీసులను ఆశ్రయించింది. కంటిపాపలా పెంచుకున్న దత్తపుత్రికను వదులుకునేందుకు పెంచిన తల్లికి మనసు రాకపోవడంతో పంచాయతీ అధికారుల వద్దకు చేరింది. ఏం జరుగుతుందో తెలియక.. ఇద్దరు తల్లులకు తాత్కాలికంగా దూరమై చిన్నారి తన్విత అమ్మ ప్రేమ కోసం అమాయకంగా ఎదురు చూస్తోంది.

 చిన్నారి తన్విత కోసం ఇద్దరు తల్లులు ఆరాటపడుతున్నారు. పాప తమకు కావాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటు కన్నతల్లి, అటు పెంచిన తల్లి నడుమ చిన్నారి నలిగిపోతోంది. తనను పెంచిన తల్లి దగ్గరకు తీసుకెళ్లాలని అధికారులను అమాయంగా అడుగుతోంది. తన్వితను చూసేందుకు ఇద్దరు తల్లులు రావడంతో ఖమ్మం బాలవికాస్‌ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాపను చూసేందుకు ఇద్దరినీ అధికారులు అనుమతించలేదు. దీంతో వారిద్దరూ అక్కడ బైఠాయించారు. తన బిడ్డను ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కన్నతల్లి మాలోతు ఉమ బెదిరించింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తనకే పాపను ఇవ్వాలని భోరున విలపించింది. పెంచిన తల్లి వేముల స్వరూపకే తన్వితను అప్పగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఇద్దరు తల్లులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. డీఎన్‌ఏ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాత పాపను ఎవరికి అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

వివాదం ఇదీ..
మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం చిన్నా కిష్టాపురం గ్రామానికి చెందిన మాలోతు ఉమ-భావ్‌సింగ్‌ దంపతులు ఇల్లెందులోని గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తూ స్టేషన్ బస్తీలో నివాసముంటున్నారు. వీరికి తొలి సంతానంలో పాప పుట్టింది. రెండో సంతానంగా జన్మించిన తన్వితను 2015, జనవరి 28న స్ట్రట్‌ఫిట్ బస్తీకి చెందిన వేముల స్వరూప-రాజేందర్ దంపతులకు దత్తత ఇచ్చారు. ఇందుకోసం తన్విత తల్లి, తండ్రికి రూ. 25 వేలు తీసుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత వచ్చి తన కుమార్తెను ఇచ్చేయాలని ఈ నెల 22న ఇల్లెందు పోలీసులను ఉమ ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే పాపను ఇచ్చేది లేదని పెంచిన తల్లి స్వరూప స్పష్టం చేసింది. రెండున్నరేళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న తన్వితను తన నుంచి దూరం చేయడం భావ్యం కాదని ఆమె వాదిస్తోంది.

మరిన్ని వార్తలు