భవనం పూర్తి కాదు.. కష్టాలు తీరవు

15 May, 2019 08:15 IST|Sakshi
ఆస్పత్రి ప్రాంగణంలో భోజనాలు చేస్తున్న రోగులు, సహాయకులు

సుల్తాన్‌ బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో రోగుల పాట్లు

మూడేళ్లుగా పూర్తికాని భవన నిర్మాణం

సుల్తాన్‌బజార్‌: సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడకు వచ్చే గర్భిణులు, తోడుగా వచ్చే సహాయకులకు కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో నిలుచునే చోటు లేకపోవడంతో చాలామంది ప్రాగంణంలోను, చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి. రోగులు, వారి బంధువులు అందరూ బయటే ఉండటంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారుతోంది. సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు వైద్యం కోసం వస్తుంటారు.

ఇన్‌ పేషెంట్‌గా ఉన్న వారికోసం వారి బంధువుల సైతం రావడంతో నిత్యం ఆస్పత్రిలో జన సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ప్రాంగణంలో మరో కొత్త భవనం నిర్మాణం చేపట్టింది. అయితే, గత మూడేళ్లుగా నిర్మాణ పనులు నత్త నడకన నడుస్తుండటంతో రోగులకు, వారి సహాయకులకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో వారు ఆస్పత్రి ఆవరణలో నేలపైనే భోజనాలు చేయడం, అక్కడే కునుకు తీయడం చేస్తుండడంతో అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. నూతన భవనం త్వరగా పూర్తయితే గాని రోగులకు ఈ పాట్లు తప్పవు.  

మరిన్ని వార్తలు