ప్రతి ఒక్కరికీ వైద్య గుర్తింపు కార్డు 

30 Oct, 2019 04:04 IST|Sakshi
అధికారులతో సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్‌

ఆ దిశగా సమాచార సేకరణ జరపాలి 

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలందరికీ వైద్య గుర్తింపు కార్డు అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ప్రతీ ఒక్కరి ఆధార్‌ నంబర్, ఫోన్  నంబర్, వ్యక్తిగత వివరాలు, ఇప్పటికే ఏవైనా జబ్బులుంటే ఆ వివరాలను సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా ఆసుపత్రికి ఎవరైనా వ్యక్తి వస్తే అతనికి ఇచ్చిన కార్డు లేదా ఆధార్‌ లేదా ఫోన్ నంబర్‌ ద్వారా వివరాలన్నీ తెలుస్తాయని, తద్వారా చికిత్స చేయడం సులభమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే సబ్‌ సెంటర్లలో పనిచేస్తున్నవారికి డేటా ఎంట్రీలో పనిభారం ఎక్కువైందని వినతులు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న విధానాన్ని పూర్తిగా మార్చివేసి డేటా కోసం ఒకే అప్లికేషన్లను తయారు చేయాల్సిందిగా ఆదేశించారు.

జబ్బు వచ్చిన తర్వాత పరిగెత్తడం కంటే జబ్బులు రాకుండా చూసుకోవడం, జబ్బులను ముందుగా గుర్తించడంపై దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. దీని కోసం ప్రాథమిక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. గత వారం రోజులుగా ప్రాథమిక ఆరోగ్యం, సెకండరీ స్థాయిలో తీసుకోవాల్సిన విప్లవాత్మక మార్పులపై మంత్రి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా మంగళవారం ప్రజారోగ్య విభాగం సంచాలకులు, పది జిల్లాల ప్రోగ్రామింగ్‌ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. ప్రాథమిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సబ్‌ సెంటర్ల నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల వరకు తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. పీహెచ్‌సీల్లో డాక్టర్లు, సిబ్బందిని ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మారుతున్న పరిస్థితుల మేరకు ప్రాథమిక స్థాయిలో వైద్య సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని, ఏటా మెడికల్‌ కాన్ఫిరెన్స్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

ఆరోగ్య తెలంగాణగా మార్చడమే లక్ష్యం.. 
తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడం సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అందుకోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఈటల కోరారు. రోగాలను బట్టి మ్యాపింగ్‌ చేయాలని దీని ద్వారా ఏ జబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తున్నాయో తెలుస్తుందని చెప్పారు. ఒక్కో జిల్లాకు ఒక ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా వైద్యుల నియామకం, మందుల పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. 

కేంద్ర మంత్రితో డిన్నర్‌.. 
కేంద్ర వైద్య ఆరోగ్య సహాయమంత్రి అశ్వినికుమార్‌ చౌబే తో కలిసి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు నిర్వహించిన సమావేశానికి ఈటల రాజేందర్‌ హాజరైనట్లు మంత్రి కార్యాలయం తెలిపింది.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా