‘మెట్రో’ మార్పులపై కదలిక

3 Jan, 2015 01:32 IST|Sakshi
‘మెట్రో’ మార్పులపై కదలిక
  • ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన హెచ్‌ఎంఆర్
  • నివేదికలో ప్రత్యామ్నాయ మార్గాల సూచన!
  • సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్పు అంశం కొలిక్కి వస్తోంది. పాత నగరం, సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాల్లో మెట్రో అలైన్‌మెంట్ మార్పులకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.

    ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల సూచనతోపాటు కొత్త అలైన్‌మెంట్ వల్ల పెరగనున్న నిర్మాణ వ్యయం, అలైన్‌మెంట్‌తో ఆస్తులు కోల్పోయే బాధితులకు కొత్త భూసేకరణ చట్టం కింద చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించిన వివరాలను ఈ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ వద్ద ఉన్న ఈ ప్రతిపాదనలు త్వరలో సీఎం కేసీఆర్ పరిశీలన కోసం వెళ్లనున్నాయి. అలైన్‌మెంట్ మార్పు ప్రతిపాదనలపై సీఎం నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ విషయాన్ని మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ- హెచ్‌ఎంఆర్‌ఎల్ కన్సార్షియానికి తెలుపుతూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ లేఖ రాయనుంది.

    ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్‌టీ-హెచ్‌ఎంఆర్ కన్సార్షియం 72 కి.మీల మెట్రో మార్గాన్ని నిర్మించాల్సి ఉండగా.. అలైన్‌మెంట్ మార్పుల వల్ల అదనంగా 3.2 కి.మీ.ల రైలు మార్గాన్ని నిర్మించాల్సి రానుంది. దీనికి అదనపు వ్యయం రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు కానుందని ప్రభుత్వానికి హెచ్‌ఎంఆర్ సూచించినట్లు సమాచారం. కాగా, అలైన్‌మెంట్ మార్పుల ప్రతిపాదనలను ఇంకా పరిశీలించలేదని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి ‘సాక్షి’కి తెలిపారు.
     
    సీఎస్‌ను కలిసిన మెట్రో అధికారులు..

    మెట్రో రైలు సంస్థ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్ శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశమై ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. భూసేకరణలో జాప్యం వల్ల ప్రాజెక్టు నిర్మాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎల్‌అండ్‌టీ ఎండీ... సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంలో తదుపరి చర్చల కోసం ఈ నెల 9న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
     

మరిన్ని వార్తలు