రీజినల్‌ నేత్ర వైద్యశాలపై శీతకన్ను

15 Aug, 2018 13:26 IST|Sakshi
వరంగల్‌లోని రీజినల్‌ నేత్రవైద్యశాల 

 ‘కంటి వెలుగు’తో పెరగనున్న రద్దీ

నియామకం కాని అదనపు సిబ్బంది

సిద్ధం కాని  ఆపరేషన్‌ థియేటర్లు

ఎంజీఎం: ప్రజల్లో దృష్టి సమస్యను పరిష్కరించేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుండగా వరంగల్‌ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేవు. ఇప్పటికే ఇక్కడ సిబ్బంది కొరత ఉండగా బుధవారం ప్రారంభమయ్యే కంటివెలుగు కార్యక్రమంతో పెరగనున్న రద్దీకి తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న నాలుగు యూనిట్లలో నలుగురు ప్రొఫెసర్లు అవసరం ఉండగా, ఒక్క ప్రొఫెసర్‌ స్థాయి అధికారి కూడా లేరు. ఈ క్రమంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు ప్రభుత్వం సూపరింటెండెంట్‌ హోదా కల్పిస్తూ సోమవారం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

వైద్యుల కొరత..

వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజల నేత్ర సమస్యల కోసం వరంగల్‌ ప్రాంతీయ వైద్యశాల ఉంది. వంద పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి నిత్యం 300 నుంచి 400 మంది కంటి వ్యాధిగ్రస్తులు వస్తుంటారు. ఇందులో నిత్యం 40 మందికి ఆపరేషన్లు అవసరమవుతున్నాయి. ఆపరేషన్‌ చేసేందుకు ఒక రోజు, అబ్జర్వేషన్‌కు ఒక రోజు ఇక్కడే ఉంటున్నారు. దీంతో రోజూ 80కి పైగా పడకలు నిండుగా ఉంటున్నాయి.

ఔట్‌ పేషెంట్‌ విభాగం కాకుండా ఆపరేషన్లు పర్యవేక్షించేందుకు నాలుగు యూనిట్లు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఒక్కో యూనిట్‌లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరం. కానీ నలుగురు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఆనస్తీషియా యూనిట్‌ వైద్యులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, ఒకే ఒక్క డిప్యూటేషన్‌ అస్తీషియా వైద్యురాలితో సేవలను కొనసాగిస్తున్నారు.

నిత్యం 360 మంది..

కంటి వెలుగు ప్రత్యేక బృందాలు కంటి సమస్యలు గుర్తించేందుకు ఆగస్టు 15 నుంచి ఫిబ్రవరి 28 వరకు రోజూ గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. రోజూ గ్రామీణ ప్రాంతాల్లో 250, పట్టణ ప్రాంతాల్లో 300 మందిని పరిశీలించాలని నిర్ణయించారు. ఈ లెక్కన రోజూ సగటున 50 మంది వరకు ఆపరేషన్‌ కోసం ఆస్పత్రులకు రెఫర్‌ చేయాల్సిన వస్తుంది. వరంగల్‌ నగరంలో రీజనల్‌ ఐ ఆస్పత్రిని మినహాయిస్తే మరో ఎనిమిది ఆస్పత్రులను కంటి వెలుగు కోసం ఎంపిక చేశారు. ఈ ఎనిమిది ఆస్పత్రుల సామర్థ్యం రీజనల్‌ ఐ ఆస్పత్రికి సమానంగా లేదు.

ఇతర జిల్లాల నుంచి..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కంటి ఆస్పత్రుల్లో వైద్యులు లేరు. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన ప్రజలకు వరంగల్‌ నగరమే దిక్కు. ఇది కాకుండా జనగామ, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన వారు వరంగల్‌లో ఆపరేషన్‌ చేయించుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. వీరందరికీ తగ్గట్లుగా పూర్తి స్థాయిలో రీజనల్‌ నేత్ర వైద్యశాలలో ఏర్పాట్లు చేయలేదని ప్రభుత్వ వైద్యులే అంటున్నారు.

కంటి వెలుగు కోసం సమీక్షలు నిర్వహిస్తున్నా అధికార గణం మౌలిక సదుపాయాల మీద దృష్టిసారించడం లేదని విమర్శిస్తున్నారు. అద్దాలు, మందుల సరఫరాపై చూపిన శ్రద్ధ ఆపరేషన్‌ థియేటర్ల ఏర్పాటుపై పెట్టడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం కంటి ఆస్పత్రిలో ఉన్న వైద్య సిబ్బంది కొరత కారణంగా 40 ఆపరేషన్లకు పరిమితం అవుతున్నారు. రేపు పెరగబోయే రోగులకు తగ్గట్లుగా సిబ్బందిని అందుబాటులో ఉంచకపోతే ఇబ్బందులు ఎదురయ్యేందుకు ఆస్కారం ఉంది. పడకలు, ఆపరేషన్‌ థియేటర్ల సామర్థ్యం పెంచకుండా హడావుడిగా ఆపరేషన్లు నిర్వహించి, అబ్జర్వేషన్‌ లేకుండా రోగులకు బయటకు పంపితే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇకపై నేత్ర వైద్యశాలకు వచ్చే రోగులందరూ కంటి వెలుగు ద్వారా వస్తారని అభ్రిపాయ పడుతున్నారు.

పది రోజుల్లో భర్తీ చేస్తాం..

కంటి వెలుగు కార్యక్రమం ద్వారా శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వారిని గుర్తించి రెఫరెల్‌ ఆస్పత్రులకు పంపిస్తాం. నేత్ర వైద్యశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన పదిరోజుల్లో నియామకాలు జరిగేలా చూస్తాం. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా ఖాళీలను భర్తీ చేయాలని నివేదించాం. శస్త్రచికిత్సల సంఖ్య ప్రకారం ఏర్పాట్లు చేస్తాం.

– హరీష్‌రాజు, డీఎంహెచ్‌ఓ, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

మరిన్ని వార్తలు