వెయ్యేళ్ల కళాసృష్టి!

11 Mar, 2018 02:47 IST|Sakshi
వెల్దుర్తి..

మట్టి తవ్వుతుంటే వెలుగు చూసిన కొత్త చరిత్ర

ఏడడుగుల విగ్రహం.. 
నాలుగు చేతులు, వాటిలో త్రిశూలం, ఖట్వాంగం, గద వంటి ఆయుధాలు.. ఓ కాలు నిటారుగా, మరోకాలు పైకెత్తి ఠీవీగా నిలబడ్డ రూపం.. ఆకృతిలో శివుడి రూపం.. కానీ ద్వారపాలక విగ్రహం.. ఇటీవల ఓ ఇంటి పని కోసం తవ్వుతుండగా బయటపడింది.. 

ఏదో పెద్ద దేవాలయానికి ముందు స్వాగతం పలుకుతున్నట్టు ఠీవి ఒలకబోస్తున్న ఈ నిర్మాణాలు ఏమిటి?

ఎవరు నిర్మించారు?
ఏదో గొప్ప చరిత్రకు ఆనవాళ్లా.. శిథిలమైపోయిన వైభవానికి నిదర్శనాలా.. వెయ్యేళ్ల కిందటివిగా నిపుణులు అంచనా వేస్తున్న ఈ నిర్మాణాలు మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్నాయి.

భారీ ద్వారపాలకుడి విగ్రహం
ఇటీవల తోరణానికి సమీపంలో ఉన్న ఆలయానికి కుడివైపున తవ్వుతుండగా ఏడడుగుల ఎత్తున్న ద్వారపాలకుడి విగ్రహం బయటపడింది. పాదాలకు కడియాలు, నడుము దిగువన కీర్తిముఖం, పైన దట్టి, కుడి భుజం నుంచి వేసిన కలాల జంధ్యం, కంఠహారాలు, మూడో నేత్రం, కాకతీయ శైలి కిరీటం, దానిపై త్రిశూల ఆకృతి కనిపిస్తున్నాయి. ఇక ఈ ఆలయానికి సమీపంలోనే ఆంజనేయుడి ఆలయం, నాగశిల్పాలు, శిఖర మండపంలో గరుడ విగ్రహమున్న 20 అడుగుల ఎల్తైన రాతి ధ్వజ స్తంభం, 15 అడుగుల ఎత్తున్న విజయ స్తంభం, పది సోపానాలు, 16 స్తంభాల రంగమండపంతో విఠలేశ్వర మందిరం, దశావతారాలు చెక్కిన 4 అడుగుల వైష్ణవ విగ్రహం.. ఇలా ఆలయాలు, విగ్రహాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ చోటు ఏదో పెద్ద దేవాలయ సమూహం అయి ఉంటుందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల ఆలయాలు, శిల్పాల్లో కాకతీయుల గుర్తులు కనిపిస్తున్నా.. కల్యాణి చాళక్యుల నాటి నిర్మాణాలు అయి ఉంటాయని భావిస్తున్నారు. ఇక్కడ తవ్వకాలు జరిపితే ఎన్నో కొత్త విశేషాలు బయటపడే అవకాశముంది. 

ఔత్సాహిక పరిశోధకుల పరిశీలనలో..
వెల్దుర్తిలో ఉన్న రాతి తోరణం చాలా కాలంగా ఉన్నా దానిని ఇంతకాలంగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇటీవల అక్కడికి సమీపంలో ఏడడుగుల ఎత్తున్న ద్వారపాలకుడి విగ్రహం వెలుగుచూసింది. దాంతో ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళి, చంటి, మురళీధర్‌రెడ్డి తదితరులు వెల్దుర్తిలోని ఈ నిర్మాణాలను పరిశీలించారు. ఇక్కడి భారీ రాతి తోరణంపై ఇరువైపులా కీర్తి ముఖాలు చెక్కి ఉన్నాయి. పైన రెండు వైపులా శిల్పాల సమూహంతో అర్ధ వృత్తాకారపు నల్లరాతి ఫలకం ఉంది. దానిపై గజలక్ష్మి,, క్షీరసాగర మథనం, శృంగార నారసింహుడు, పాదాల కింద రాక్షసుడి ఆకృతులు కనిపిస్తున్నాయి. తోరణానికి దిగువన ఏడు మొగ్గల ఆకృతులు, వాటికిపైన ఆరు రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల ద్వారా సూర్య కిరణాలు ప్రధాన ఆలయ దేవతామూర్తిని తాకేలా నిర్మించి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే తోరణానికి సమీపంలో ప్రస్తుతం ఓ చిన్న దేవాలయం ఉంది. దాని ముందు నంది విగ్రహం ఉన్నా.. లోపల అనంత శయనుడి విగ్రహమూర్తి ఉండడం గమనార్హం. 
– సాక్షి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు