కనీసం రెండేళ్లు దాటితేనే బదిలీ

24 May, 2018 02:47 IST|Sakshi

ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలపై అజయ్‌ మిశ్రా కమిటీ సిఫారసు 

ఒకేచోట ఐదేళ్లు పని చేస్తే తప్పనిసరిగా బదిలీ 

12 పేజీలతో మార్గదర్శకాల నివేదిక.. సీఎం వద్దకు ఫైలు

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. అజయ్‌ మిశ్రా కమిటీ సిఫారసులతో ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు చేరింది. పైరవీలకు ఆస్కారం లేకుండా వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని కమిటీ సూచించింది. నోటిఫికేషన్‌ జారీ చేసిన నాటి నుంచి పది రోజుల్లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. 

12 పేజీల నివేదిక 
12 పేజీలతో అజయ్‌ మిశ్రా కమిటీ రూపొందించిన బదిలీల మార్గదర్శకాల నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి మంగళవారమే సమర్పించింది. బుధవారం ఆ నివేదికను ముఖ్యమంత్రికి సీఎస్‌ అందజేసినట్లు తెలిసింది. బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు వీలుగా వివరణాత్మక బదిలీ పాలసీని కమిటీ రూపొందించింది. ఏ ఉద్యోగి అయినా, కనీసం రెండేళ్లు దాటితేనే బదిలీకి అవకాశం ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసింది. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని తప్పని సరిగా బదిలీ చేయాలని సూచించింది. ఐదేళ్లు పని చేసిన వారు ఒకరి కంటే ఎక్కువ మంది ఉండే డ్రా పద్ధతిలో బదిలీ చేయాలని నివేదికలో పేర్కొంది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్‌ టూ సర్వ్‌ ఉద్యోగులకు రెండేళ్ల కాలపరిమితి నిబంధన వర్తించదని కమిటీ తెలిపింది. 

స్పౌస్‌ కేటగిరీలో ముందుగా బదిలీలు 
ముందుగా స్పౌస్‌ కోటా బదిలీలు చేపట్టాలని కమిటీ పేర్కొంది. 20 శాతం మంది ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలనే నిబంధనను తొలగించాలని, ఈ ఏడాదికి 40 శాతం బదిలీలు చేపట్టాలని అభిప్రాయపడింది. ప్రతి కార్యాలయంలోనూ ఉద్యోగులు అక్కడ పని చేస్తున్న కాలం వివరాలు తెలిపే జాబితాను నోటీసు బోర్డుపై లేదా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ జాబితాను అవరోహణ క్రమంలో రూపొందించాలని తెలిపింది. బదిలీల ప్రక్రియను నిర్వహించేందుకు రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయిల్లో త్రిసభ్య కమిటీలను నియమించాలని నివేదికలో సూచించింది. రాష్ట్రస్థాయిలో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, జోనల్‌ స్థాయిలో హెచ్‌వోడీ, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. 

మారుమూల ప్రాంతాల్లోని వారికి ప్రాధాన్యం 
దీర్ఘకాలంగా మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అజయ్‌ మిశ్రా కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. ఫోకల్‌ పోస్టులో చాలాకాలంగా పని చేస్తున్న ఉద్యోగులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించింది. మారుమూల ప్రాంతాలు ఏవనేది ఉద్యోగ సంఘాలతో చర్చించి శాఖాపరంగా నిర్ణయించాలని తెలిపింది. విద్య, అటవీ, రెవెన్యూ, రవాణా, పోలీసు శాఖల బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది. మెంటల్‌ రిటార్డెడ్‌ పిల్లలు ఉన్న వారికి బదిలీల్లో అవకాశం ఇవ్వాలని తెలిపింది. అలాగే అనారోగ్య కారణాలు, డిపెండెంట్‌ బదిలీలకు కూడా స్పష్టమైన సూచనలు చేసింది. కేన్సర్, నెర్వ్‌ సర్జరీలు, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, లివర్, కిడ్నీ మార్పిడి, బ్రెయిన్‌ సర్జరీ వంటి తీవ్రమైన అనారోగ్యాల బారినపడిన ఉద్యోగులను మాత్రమే బదిలీలకు అవకాశం కల్పించాలని సిఫారసు చేసింది.

సీఎం సంతకం కాగానే.. 
బదిలీల మార్గదర్శకాల ఫైలుపై ముఖ్యమంత్రి నేడో రేపో సంతకం చేసే అవకాశం ఉంది. సీఎం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే ఈనెల 28 నుంచి లేదా జూన్‌ 1వ తేదీ నుంచి పది రోజుల షెడ్యూల్‌తో బదిలీల ప్రక్రియ చేపట్టేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. బదిలీ ఉత్తర్వులు అందిన మూడు రోజుల్లోపు రిలీవ్‌ చేయాలని లేకపోతే రిలీవ్‌ చేసినట్టుగానే భావించాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ముగిసిన వెంటనే బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని కమిటీ పేర్కొంది.   

మరిన్ని వార్తలు