పెట్రో మంట పరిష్కారానికి కృషి

24 May, 2018 02:41 IST|Sakshi

న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు వరుసగా పదో రోజూ పెరగడంపై న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ స్పందించారు. అంతర్జాతీయంగా అస్థిరత, ముడిచమురు ధరల్లో మార్పులు వంటి సమస్యలకు ప్రజలు ప్రభావితం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బుధవారం నాడిక్కడ ప్రధాని నేతృత్వంలో కేబినెట్‌ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం రూ.25 వరకూ తగ్గించవచ్చని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చేసిన ట్వీట్లపై వ్యాఖ్యలు చేయబోనని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ అధికారం కోల్పోయినప్పటి నుంచి చిదంబరం ట్విటర్‌లో చురుగ్గా మారారని ఎద్దేవా చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్‌ కనెక్టివిటీ అమలు ప్రతిపాదనను క్యాబినెట్‌ ఆమోదించిందన్నారు. మొబైల్‌ కనెక్టివిటీ రెండో విడతలో భాగంగా 10 రాష్ట్రాల్లోని 96 జిల్లాల్లో రూ.7,330 కోట్లతో 4,072 టవర్లను 2జీ, 4జీ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తామన్నారు. ప్రాజెక్టులో భాగంగా ఏపీలో 8 జిల్లాల్లో 429, తెలంగాణలో 14 జిల్లాల్లో 118 టవర్‌ లోకేషన్లు గుర్తించామన్నారు. దేశంలో తొలిæ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని మణిపూర్‌లో ఏర్పాటు చేసేందుకు త్వరలో ఆర్డినెన్స్‌ తెస్తామన్నారు.

మరిన్ని వార్తలు