హుజుర్‌నగర్‌ నూతన రెవెన్యూ కార్యాలయం ప్రారంభం

29 Jun, 2020 13:11 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: సంక్షోభ సమయంలో కూడా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం మంత్రులు కేటీఆర్,‌ జగదీశ్‌రెడ్డిలు సూర్యాపేటలో పర్యటించి హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో హరితహారం మొక్కలు నాటి, నూతనంగా ఏర్పాటైన హుజూర్‌నగర్‌ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను సుందరీకరణ చేస్తున్నామన్నారు. 

ప్రతి నెల మున్సిపాలిటీలకు, పంచాయతీలకు నిధులు అందిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంత దెబ్బతిన్నప్పటికీ వేగంగా పుంజుకుందన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా రైతు బంధు పథకం రైతులకు ఆసరాగా నిలిచిందన్నారు. అర్హులైన వారందరికి ఆసరా పెన్షన్‌లు అందిస్తున్నామని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్‌ పనులను త్వరలోనే పూర్తి చేసిన సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, జెడ్‌పీ చైర్‌ పర్సన్‌ దీపికా, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు