ఈ–వాహనాలకు ‘ఇంటి’ చార్జీలే.. 

21 Oct, 2019 02:20 IST|Sakshi

ఎవరైనా పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు పెట్టొచ్చు..

చార్జింగ్‌ స్టేషన్లలో సర్వీస్‌ చార్జీలు అదనం

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు  

సాక్షి, హైదరాబాద్‌ : ఇళ్ల వద్ద ప్రజలు సొంత ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌కు గృహ కేటగిరీ విద్యుత్‌ చార్జీలనే వర్తింపజేయాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లకు మాత్రం ప్రత్యేక మీటర్లు ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఖరారు చేసిన ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ టారిఫ్‌ను వర్తింపజేయాలని కోరింది. పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల వద్ద చార్జింగ్‌ సదుపాయం పొందే వారు విద్యుత్‌ చార్జీలతో పాటు సర్వీసు చార్జీలు సైతం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. సర్వీసు చార్జీలను ఈఆర్సీ/రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పబ్లిక్‌ చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. 40 లక్షలకు పైగా జనాభా గల హైద రాబాద్‌ వంటి మహానగరాలు, వాటికి అనుబంధంగా ఉన్న రహదారుల వద్ద ఏడాది నుం చి మూడేళ్లలోగా ప్రైవేటు చార్జింగ్‌ సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించింది. 

ఈ–వాహనాల చార్జింగ్‌ మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.. 

  • గృహాలు/కార్యాలయాల వద్ద ప్రైవేటు చార్జింగ్‌ను అనుమతించాలి. డిస్కంలు ఆ మేరకు సదుపాయాలు కల్పించాలి.  
  • పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు (పీసీఎస్‌)ల ఏర్పాటుకు ఈఆర్సీ నుంచి లైసెన్సు పొందాల్సి న అవసరం లేదు. ఏ వ్యక్తి/సంస్థ అయి నా పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ), కేంద్ర విద్యుత్‌ మం త్రిత్వ శాఖ జారీ చేసిన/జారీ చేసే మార్గదర్శకాలు, సాంకేతిక, భద్రత, నిర్వహణ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.  
  • పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్‌ నెలకొల్పాలనుకునే వ్యక్తులు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం డిస్కంకు దరఖాస్తు చేసుకోవాలి. డిస్కంలు ప్రాధాన్యతనిచ్చి కనెక్షన్‌ జారీ చేయాలి.  
  • ఏదైనా చార్జింగ్‌ స్టేషన్‌/చైన్‌ ఆఫ్‌ చార్జింగ్‌ స్టేషన్లు నేరుగా ఓపెన్‌ యాక్సెస్‌ విధానంలో విద్యుదుత్పత్తి కంపెనీ నుంచి విద్యుత్‌ను పొందొచ్చు. 

పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్‌కు ఉండాల్సిన కనీస సదుపాయాలు

  • సబ్‌ స్టేషన్‌ ఉండాల్సిన అన్ని రకాల పరికరాలతో ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌  
  • సబ్‌ స్టేషన్‌ ఉండాల్సిన అన్ని రకాల పరికరాలతో ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌  
  • 33/11 కేవీ లైన్‌/కేబుల్స్, అనుబంధ పరికరాలు 
  • ఆన్‌లైన్‌లో చార్జింగ్‌ స్లాట్ల బుకింగ్‌ సదుపాయం కల్పించేందుకు కనీసం ఒక ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌ సర్వీసు ప్రొౖవైడర్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఉండాలి. చార్జింగ్‌ స్టేషన్ల లొకేషన్, చార్జర్ల రకాలు, సంఖ్య, లభ్యత, చార్జీల వివరాలను వాహనదారులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి.  
  • సరైన సివిల్స్‌ వర్క్స్, సరైన కేబులింగ్‌/ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ 
  • వాహనాల రాకపోకలతో పాటు చార్జింగ్‌కు సరిపడా స్థలం 
  • హౌసింగ్‌ సొసైటీలు, మాల్స్, కార్యాలయ సముదాయాలు, రెస్టారెంట్లు, హోటళ్ల తదితర ప్రాంతాల వద్ద చార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి సందర్శకుల వాహనాల చార్జింగ్‌కు అనుమతించొచ్చు.  

మరిన్ని వార్తలు