పారిపోయిన కుర్రాడు.. పంజాబీ యువకుడిగా తిరిగొచ్చాడు

4 Apr, 2019 07:12 IST|Sakshi
ఇద్దరు కుమారులతో తల్లి సుసన్న ,పంజాబీ యువకుడిలా దినేష్‌

ఫేస్‌బుక్‌ ద్వారా ఆచూకీ లభ్యం

ఎనిమిదేళ్ల తర్వాత తల్లిచెంతకు చేరిన వైనం

అమృత్‌సర్‌ రణకళలో భూస్వామి వద్ద వ్యవసాయ పనులు

నేరేడ్‌మెట్‌: క్రికెట్‌ ఆడేందుకు వెళ్లి..ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆగ్రహించి అన్న తమ్ముడిపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికిలోనైన సదరు బాలుడు నేరుగా వెళ్లి సికింద్రాబాద్‌లో రైలెక్కి ఢిల్లీకి చేరుకున్నాడు. రైలులో పరిచయమైన వారితో కలిసి పంజాబ్‌ రాష్ట్రం, అమృత్‌సర్‌ సమీపంలోని రణకళ గ్రామానికి చేరుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటుండటంతో అతడి వేషం, భాష పూర్తిగా మారిపోయాయి. పంజాబీ యువకుడిగా మారాడు. చివరికి ఫేస్‌బుక్‌ ద్వారా అతడిని గుర్తించిన అన్న పోలీసులకు సమాచారం అందించడంతో ఎనిమిదేళ్ల తర్వాత అతను తల్లి చెంతకు చేరాడు. సినిమా కథను తలపించిన ఈ ఉదంతంపై బుధవారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌  వివరాలు వెల్లడించారు.

మౌలాలి పరిధిలోని నవోదయ నగర్‌కు చెందిన సుసన్న, అబ్సలాం దంపతులకు  అనుపమ్‌ దీపక్, దినేష్‌ జినాలి అనే ఇద్దరు కుమారులు. 2011లో 13 ఏళ్ల వయసు ఉన్న దినేష్‌ క్రికెట్‌ ఆడేందుకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా రావడంతో అతడి సోదరుడు అనుపమ్‌ దీపక్‌ తమ్ముడిని కొట్టాడు. మనస్తాపంతో దినేష్‌ ఇంట్లో డబ్బులు తీసుకొని..సికింద్రాబాద్‌లో రైలెక్కి..ఢిల్లీ చేరుకున్నాడు. దీంతో అతని కుటుంబసభ్యులు 2011 జనవరి 26న కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్న దినేష్‌ స్థానికుల సహాయంతో రణకళ గ్రామానికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన భూస్వామి  సుఖ్‌రాజ్‌ సింగ్‌ అతడిని చేరదీశాడు. అప్పటి నుంచి వారి వద్దనే ఉంటున్న దినేస్‌ అక్కడే  పొలం పనులు, ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  ఈ క్రమంలో పంజాబీ, హిందీ నేర్చుకున్న అతను పూర్తిగా పంజాబీ యువకుడిలా మారిపోయాడు. 2015లో తన కుటుంబ సభ్యులు గుర్తుకువచ్చి వారిని చూసేందుకు సికింద్రాబాద్‌కు వచ్చిన అతను తనను మళ్లీ తిరిగి వెళ్లనివ్వరేమోననే భయంతో వారిని చూడకుండానే వెనుదిరిగి వెళ్లిపోయాడు.

ఆచూకీ దొరికిందిలా...
గత ఏడాది ఆగస్టులో ఫేస్‌బుక్‌లో ఓ యువకుడి ఫొటోను చూసిన అనుపమ్‌ దీపక్‌ తన తమ్ముడిగా అనుమానించి సైబర్‌ క్రైం పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టి సైబర్‌ క్రైం పోలీసులు ఫేస్‌బుక్‌లోని దినేష్‌ జినాలి పేరుతో ఉన్న ప్రొఫైల్‌ ఆధారంగా విచారణ చేపట్టారు. ఐపీ అడ్రస్‌ ద్వారా అతడిని దినేష్‌గా, అమృత్‌సర్‌ జిల్లా రణకళలో ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసు అధికారుల బృందం సుఖ్‌రాజ్‌సింగ్‌ను కలిసి విషయం చెప్పారు. వారిని ఒప్పించి దినేష్‌ను రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌కు తీసుకువచ్చిన పోలీసులు  సీపీ సమక్షంలో బుధవారం తల్లి సుసన్న, అన్న అనుపమ్‌ దీపక్‌లకు అప్పగించారు.

ఆనందంగా ఉంది: సుసన్న
సీపీ సమక్షంలో తల్లీకొడుకులు కలుసుకొని కంటతడి పెట్టుకున్నారు. కొడుకు ఉన్నాడో లేడో తెలియదు. ఉంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పటికైనా నా కొడుకు తిరిగి రావాలని దేవుడిని ప్రార్థించాను. ఇన్నేళ్ల తరువాత  ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉందని తల్లి సుసన్న పేర్కొంది. 

కొడుకులా ఆదరించారు...
తనను చేరదీసి ఎనిమిదేళ్ల పాటు సొంత కొడుకులా చూసుకున్న  సుఖ్‌రాజ్‌సింగ్‌ కుటుంబాన్ని వదిలి రావడం  బాధగా ఉందని దినేష్‌ అన్నాడు. రణకళలో పని చేస్తూ పంజాబీ, హిందీ నేర్చుకున్నానని, దుబాయ్‌ వెళ్లి ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లిష్‌ నేర్చుకున్నట్లు తెలిపాడు. అంతలోనే ఫేస్‌బుక్‌  ద్వారా కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నాడు.

మరిన్ని వార్తలు