ఇక పెద్దల పోరుకు సై

24 Nov, 2015 23:56 IST|Sakshi

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు
 షెడ్యూల్ విడుదల
 డిసెంబర్ 27న పోలింగ్
 769 మంది స్థానిక సంస్థల సభ్యులకు ఓటుహక్కు
 ఒక  ఓటరు.. రెండు ఓట్లు వేసే మహదావకాశం

 
 ఓటర్లు వీరే...
 ఎంపీటీసీలు                                  612
 జెడ్పీటీసీలు                                 33
 మున్సిపల్ కౌన్సిలర్లు                      59
 నగరపంచాయతీ కౌన్సిలర్లు                60
 ఎక్స్ అఫీషియో సభ్యులు                  05
 మొత్తం ఓటర్లు                              769
 
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :  ‘పెద్దల’ పోరుకు తెరలేచింది. జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలో రెండు శాసనమండలి స్థానాలకు నగారా మోగింది. డిసెంబర్ 27న జరిగే ఎన్నికలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఈసీ ప్రకటించింది. కౌన్సిల్‌కు ప్రాతినిథ్యం వహించిన పట్నం నరేందర్‌రెడ్డి ఈ ఏడాది మే 1న పదవీ విరమణ చేయడంతో ఒక సీటు ఖాళీ అయింది. ఈ స్థానంతో పాటు రాష్ట్ర పునర్విభజనలో జిల్లాలో అదనంగా పెరిగిన స్థానానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్నాయి.
 
 ఎన్నికలకు ముహూర్తం ఖరారు కావడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. కొన్నాళ్లుగా ఈ సీటుపై కన్నేసిన ఆశావహులు.. నోటిఫికేషన్ రావడంతో ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. స్థానిక సంస్థల్లో సాంకేతికంగా కాంగ్రెస్, టీడీపీలకే బలం ఉన్నప్పటికీ, సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణలు మారిపోయాయి.
 చాలామంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు గులాబీ గూటికి చేరడంతో సంఖ్యాబలాల్లో భారీ తేడా వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలు పావులు కదుపుతున్నాయి.

 ఒక ఓటరు... రెండు ఓట్లు
 ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలకు ఓ విశిష్టత ఉంది. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒకేసారి రెండు స్థానాలకు పోలింగ్ జరుగుతుండడంతో ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది. దీంతో ప్రతి సభ్యుడు ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేస్తారని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఈ మేరకు ప్రతి పోలింగ్ స్టేషన్‌లో రె ండు బ్యాలెట్ బాక్సులు ఉంటాయని చెప్పారు. ఇదిలా ఉండగా, స్థానిక సంస్థల కోటాలో 769మంది ఓటుహక్కు వినియోగించున్నారు. మండల, జిల్లా ప్రాదేశిక సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు సహా మరో ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేయనున్నారు. ఇదిలా ఉండగా, గ్రేటర్‌కు పాలకవర్గం లేకపోవడంతో దీని పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఫలితంగా 48 డివిజన్ల కార్పొరేటర్లు ఓట్లు లేకుండానే ఇద్దరు సభ్యులు ‘పెద్దల’సభలోకి ప్రవేశించనున్నారు.
 

మరిన్ని వార్తలు