మెట్రో, ఆర్టీసీ కామన్‌ కార్డ్‌ వచ్చేస్తోంది!

18 Dec, 2018 20:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జంట నగరాల ప్రయాణికులకు తీపికబురు. మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించడానికి కామన్ మొబిలిటీ కార్డ్(సీఎంసీ) త్వరలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై ఉన్నతాధికారులు బేగంపేటలోని హెచ్ఎంఆర్ఎల్ కార్యాలయంలో మంగళవారం చర్చలు జరిపారు. జంట నగరాల్లో కామన్ మోబిలిటీ కార్డ్ అమలుపై సమీక్షించారు. ఎస్‌బీఐ/హిటాచీ కన్సార్టియం ద్వారా దీన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం వారంలో ఎస్‌బీఐతో చర్చలు జరిపి విధివిధానాలు ఖరారు చేయనున్నారు.

2019 జనవరి చివరికి కనీసం 100 ఆర్టీసీ బస్సులు, 50 ఆటోస్ మెట్రో క్యాంపెన్షన్ ప్రాంతాల ద్వారా 2 మెట్రో స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. పురోగతిని పరిశీలించిన తర్వాత జంట నగరాల్లోని అన్ని మెట్రో స్టేషన్లకు విస్తరించాలని యోచిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవెన్యూ) పురుషోత్తమ నాయక్, ఎస్‌బీఐ అధికారి ఓబుల్‌ రెడ్డి, ఆటో డ్రైవర్స్ యూనియన్ కన్వీనర్‌ ఖాన్‌, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ సీనియర్‌ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు