తనఖా తప్పనిసరి!

14 Jun, 2018 01:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అన్ని భవన నిర్మాణాలకు వర్తింపు

ప్రస్తుతం కార్పొరేషన్లలో 300 చదరపు మీటర్లు, మున్సిపాలిటీల్లో 200 చదరపు మీటర్లలోపు స్థలాల్లో నిర్మాణాలకు మినహాయింపు

దీంతో ప్లాట్లను విభజించి వేర్వేరు నిర్మాణాలుగా చూపుతున్న యజమానులు

తనఖా లేకపోవడంతో చర్యలు తీసుకోలేకపోతున్న పురపాలికలు

ప్రభుత్వ ఆమోదం రాగానే ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలక సంస్థల్లో ఇకపై చేపట్టనున్న అన్ని భవన నిర్మాణాలకు తనఖా నిబంధన తప్పనిసరి కానుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) సహా అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లలో 200 చదరపు మీటర్ల వరకు, మున్సిపాలిటీల్లో 300 చదరపు మీటర్ల వరకు ఉన్న స్థలాల్లో.. గరిష్టంగా 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు తనఖా నిబంధన నుంచి మినహాయింపు ఉంది.

అంతకు మించిన స్థలాల్లో, ఎత్తుతో నిర్మించే భవనాల్లో పది శాతం నిర్మాణ స్థలాన్ని స్థానిక పురపాలక సంస్థకు తనఖా పెట్టాల్సి ఉంటుంది. భవన నిర్మాణ నిబంధనలను, అనుమతులను ఉల్లంఘిస్తే.. సదరు భవనం/నిర్మాణంలో తనఖా పెట్టిన భాగాన్ని సదరు పురపాలక సంస్థ స్వాధీనం చేసేసుకుంటుంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టకుండా నియంత్రించేందుకు ఈ ‘తనఖా’నిబంధనను అమలు చేస్తున్నారు. ఇక ముందు పురపాలక సంస్థల్లో చేపట్టే అన్ని భవన నిర్మాణాలకు ఎలాంటి మినహాయింపు లేకుండా ఈ నిబంధన వర్తించనుంది. 

ఉల్లంఘిస్తే స్వాధీనమే.. 
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పట్టణాభివృద్ధికి, ఇళ్లు, భవనాల నిర్మాణానికి సంబంధించి మాస్టర్‌ ప్లాన్, నిబంధనలు ఉంటాయి. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను నియంత్రించేందుకు పలు నిబంధనలు ఉన్నాయి. అయితే భవనం ముందుభాగంలో, చుట్టూ ఖాళీ స్థలం వదలడం (సెట్‌బ్యాక్‌), ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిమితులు, స్థలం విస్తీర్ణం మేరకు భవనం ఎత్తు, అంతస్తులు ఉండటం వంటి నిబంధనలను యజమానులు సరిగా పట్టించుకోవడం లేదు. దాంతో నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా నిర్మాణాలు జరపకుండా పురపాలక శాఖ ‘తనఖా’నిబంధనను అమల్లోకి తెచ్చింది.

మున్సిపాలిటీల్లో 300 చదరపు మీటర్లకుపైగా, కార్పొరేషన్లలో 200 చదరపు మీటర్లకుపైగా విస్తీర్ణంలో భవనాలు నిర్మించేవారు.. ఆయా నిర్మాణ వైశాల్యంలో 10 శాతం భాగాన్ని స్థానిక పురపాలికకు తనఖా పెట్టిన తర్వాతే భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తున్నారు. ఈ మేరకు యజమానులు నిర్మాణ వైశాల్యంలోని 10 శాతం భాగాన్ని నోటరీ అఫిడవిట్‌ ద్వారా పురపాలక సంస్థకు తనఖా పెట్టాలి. రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన నిషేధిత ఆస్తుల జాబితాలో ఈ తనఖా పెట్టిన ప్రాంతాన్ని చేర్పించాలి.

ఆ తర్వాతే భవన నిర్మాణ అనుమతులు జారీ అవుతాయి. అనుమతుల మేరకు భవన నిర్మాణం జరిగిందని అధికారులు ధ్రువీకరించిన తర్వాతే.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ అవుతుంది. ఈ సర్టిఫికెట్‌ను చూపిస్తేనే.. తనఖా పెట్టిన 10 శాతం భాగాన్ని యజమాని రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వీలుంటుంది. ఎవరైనా అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు జరిపితే.. తనఖా పెట్టిన 10 శాతం భాగాన్ని స్వాధీనం చేసుకునే అధికారం స్థానిక మున్సిపాలిటీలకు ఉంటుంది.

ప్లాట్లను విభజిస్తూ నిర్మాణాలు...

తనఖా నిబంధన నుంచి తప్పించుకోవడానికి అధిక శాతం యజమానులు ప్లాట్లను విభజించి.. వేర్వేరు నిర్మాణాలుగా చూపిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. పెద్ద స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నా.. వాటిని నిబంధనల మేరకు మున్సిపాలిటీల్లో 300 చదరపు మీటర్లలోపు, కార్పొరేషన్లలో 200 చదరపు మీటర్లలోపు నిర్మాణాలుగా విభజించి.. తనఖా పెట్టకుండానే భవన నిర్మాణ అనుమతులు పొందుతున్నట్టు తేల్చారు. అనంతరం నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరుపుతున్నారని గుర్తించారు. నిబంధనల ప్రకారం ఇలాంటి భవనాలను కూల్చివేయడం తప్ప ఇతర ఏ చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.

కానీ కూల్చివేత వంటి తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి పురపాలికలు వెనకడుగు వేస్తున్నాయి. అసలు తనఖా నిబంధన నుంచి తప్పించుకోవడానికి ప్లాట్లను విభజించి అనుమతులు పొందాలని.. లైసెన్డ్‌ బిల్డింగ్‌ ప్లానర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, పురపాలికల టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందే సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మినహాయింపులను తొలగించి.. అన్ని భవన నిర్మాణాలకు 10 శాతం తనఖా నిబంధనను వర్తింపజేయాలని రాష్ట్ర పురపాలక శాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే.. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనుంది.  

మరిన్ని వార్తలు