అమ్మ ఎళ్లిపోయింది..

6 Apr, 2018 07:29 IST|Sakshi
నాగమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న భర్త సాయిలు, కుమారులు, కుమార్తెలు

గుండెలు పిండేసిన మాతృమూర్తి మరణం

ఆదెరువు కోల్పోయిన ఐదుగురు సంతానం

రాయపర్తి(వర్ధన్నపేట) : ఆ మాతృమూర్తి మరణం గుండెలను పిండేసింది. ఎనిమిది మంది సంతానానికి అన్నీ తానై చూసుకుంది. కుటుంబ భారాన్ని తన భుజస్కంధాలపై మోసిన ఆ తల్లి కన్నుమూయడంతో కన్నబిడ్డల రోదనలు మిన్నుముట్టాయి. రాయపర్తి ఎస్సీకాలనీకి ఐత సాయిలు, చంద్రమ్మ దంపతులకు కుమారుడు అంజి, కుమార్తె రేణుక సంతానం. చంద్రమ్మ చనిపోవడంతో సాయిలు నాగమ్మ(55)ను కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మొత్తం ఎనిమిది మంది సంతానం. మేస్త్రీ పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న సాయిలు పెద్ద భార్య కుమారుడు, కుమార్తె వివాహం చేయడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ముగ్గురు కుమారులు హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు.

ఇద్దరు కుమార్తెల్లో రాజేశ్వరి డిగ్రీ పూర్తి చేసింది. చంద్రకళ డిగ్రీ సెకండియర్‌ చదువుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం సాయిలు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ భారమంతా నాగమ్మపై పడింది. పిల్లలకు అన్నీ తానై చూసుకుంటోంది. కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివిస్తోంది. ఈ క్రమంలో పెద్ద కుమారుడు అబ్బాస్‌ వివాహం చేద్దామని సంబంధం చూసేందుకు వెళ్తుండగా బుధవారం సాయంత్రం నాగమ్మ అకస్మాత్తుగా గుండెపోటుకు గురైంది. వర్ధన్నపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు