ఎంపీ అభ్యర్థులకు సెంటిమెట్‌ దేవుళ్లు

2 Apr, 2019 14:09 IST|Sakshi
కాలభైరవస్వామికి పూజలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌

రామారెడ్డి: రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) శ్రీకాలభైరవుడు, మద్దికుంట గ్రామంలోని శ్రీబుగ్గరామలింగేశ్వరుడి ఆలయాలు ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్థులకు సెంటిమెట్‌ దేవుళ్లుగా మారారు. ఈ రెండు ఆలయాల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికలకు ముందు, గెలుపు తర్వాత దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్‌రెడ్డి కాలభైరవుడికి పూజలు చేసిన తర్వాతే ప్రచారం ప్రారంభించారు. అలాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే నల్లమడుగు సురేందర్‌ కాలభైరవుడిని దర్శించుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి కాలభైరవుడికి పూజలు నిర్వహించి ప్రచారం ఆరంభించారు.

అలాగే కామారెడ్డి ఎమ్మెల్యేలుగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన గంప గోవర్ధన్, షబ్బీర్‌ అలీతో పాటు బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి బుగ్గరామలింగేశ్వరుడిని దర్శించుకున్న తర్వాతే ఎన్నికల ప్రచారం చేశారు. ప్రస్తుం పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ కాలభైరవుడిని దర్శించుకుని ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి బుగ్గరామలింగేశ్వరుడికి పూజలు చేసిన తర్వాతే రంగంలోకి దిగారు. ఇలా అభ్యర్థులకు కాలభైరవస్వామి, బుగ్గరామలింగేశ్వరస్వామి సెంటిమెంట్‌ దేవుళ్లుగా మారారు.

మరిన్ని వార్తలు