టీటీడీపై స్వామి పిటిషన్‌.. స్వయంగా వాదనలు

3 Oct, 2018 15:21 IST|Sakshi
సుబ్రహ్మణ్య స్వామి (ఫైల్‌ ఫోటో)

సాక్షి. హైదరాబాద్‌ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ఏపీ ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. టీటీడీని ప్రభుత్వం అజమాయిషీ నుంచి తప్పించి నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్వామి స్వయంగా బుధవారం హైదరాబాద్‌ వచ్చి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరో పదిరోజుల్లో తిరిగి హైదరాబాద్‌ వస్తానని.. తానే స్వయంగా ఈ కేసులో వాదలు వినిపిస్తానని ఆయన తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన ఢిల్లీ పయనమయ్యారు. కాగా టీటీడీ నిధులు గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

టీటీడీలో నిధుల దుర్వినియోగం, టీటీడీకి సంబంధించిన విలువైన నగలు, కానుకలు మాయం అవుతున్నాయని ఆరోపిస్తూ.. సుబ్రహ్మణ్య స్వామి గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.  ఇదివరకే టీటీడీ వివాదంపై స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించింది. టీటీడీ ప్రధాన అర్చకుడి పదవి నుంచి రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు మాయం కావడం, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న వివాదాలు తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ చేపట్టాలని స్వామి కోరుతున్నారు.

మరిన్ని వార్తలు