నెలాఖరులో మున్సి‘పోల్స్‌’!

7 Jul, 2019 02:15 IST|Sakshi

30 లేదా 31న ఎన్నికలు.. ఈ నెల 13లోపు రిజర్వేషన్ల ఖరారు

15, 16 తేదీల్లో నోటిఫికేషన్‌!

ఆగస్టు 2న కౌంటింగ్,  4న పాలకమండళ్లు 

ఒకే విడతలో ‘పుర’ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం 

ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ సహా ఇతర అధికారులతో

ఎస్‌ఈసీ నాగిరెడ్డి సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెలాఖరులోగా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు జరపాలని మొదట భావించినా.. ఈ నెలలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో షెడ్యూల్‌ను కూడా కుదించింది. ఈ మేరకు ఓటర్ల తుదిజాబితా ప్రచురణ తేదీని కూడా నాలుగు రోజులు ముందుకు జరిపింది. 2014లో ఈవీఎంల ద్వారా మున్సిపోల్స్‌ జరగగా.. ఈసారి బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 పురపాలక సంఘాలు, మూడు నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.

15 లేదా 16న నోటిఫికేషన్‌!
ఈ నెల 15 లేదా 16వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసి, జూలై 30 లేదా 31వ తేదీన ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది. ఆగస్టు 2న ఓట్ల లెక్కింపు, 4న కొత్త పాలకమండళ్లు కొలువుదీరేలా ఈసీ ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సాధ్యమైనంత త్వరగా ఎలక్షన్లు జరపాలని యోచిస్తున్న ఈసీ.. వార్డుల వారీగా ఓటర్ల తుదిజాబితాను ఈ నెల 14 నాటికి ప్రకటించాలని శనివారం సవరించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 13 తేదీలోపు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసి జాబితాను ఎస్‌ఈసీకి అందజేసేందుకు మున్సిపల్‌ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 
 
అన్ని విభాగాలూ సిద్ధమేనా? 
ఈ నెలాఖరులోగా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడంలో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, ప్రింటింగ్‌ స్టేషనరీ డీజీ తేజ్‌దీప్‌ మీనన్, సీడీఎంఏ కమిషనర్‌ శ్రీదేవి తదితరులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలకు అవసరమైన బడ్జెట్‌ విడుదలకు ఆర్థికశాఖ, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కరదీపికలు, సమాచార పుస్తకాలు, కవర్లు తదితరాలను 17వ తేదీకల్లా ఇచ్చేందుకు, బ్యాలెట్‌పేపర్లకు అవసరమైన కాగితం సరఫరాకు ప్రింటింగ్‌ విభాగం, మున్సిపాలిటీల్లో ఎన్నికల సందర్భంగా బందోబస్తుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు పోలీస్‌శాఖ, క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల నిర్వహణకు మున్సిపల్‌ శాఖ, మొత్తంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయసహకారాలు అందించేందుకు సీఎస్‌ సన్నద్ధంగా ఉన్నట్టు ఎస్‌ఈసీకి తెలియజేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఎస్‌ఈసీ నిర్ణయించే తేదీలకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తమ తమ విభాగాలు సంసిద్ధంగా ఉన్నట్టు వెల్లడించినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, సంయుక్త కార్యదర్శి ఎన్‌.జయసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో భాగంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తేదీలపై ఎస్‌ఈసీ స్పష్టత నిచ్చినట్టు తెలిసింది. సోమవారం రాజకీయ పక్షాలతో ఎస్‌ఈసీ సమావేశం కానుండగా, మరో ఒకట్రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాన్ని నిర్వహించి ఎన్నికలకు జిల్లా యంత్రాంగాలను ఎస్‌ఈసీ సన్నద్ధం చేయనుంది. 
 
ప్రతి 800 మందికి ఒక పోలింగ్‌ స్టేషన్‌ 
ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల గుర్తింపుతో పాటు ప్రతి 800 ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్‌శాఖకు ఎస్‌ఈసీ సూచించింది. తాజాగా ఓటర్ల తుది జాబితా ప్రకటనలకు సంబంధించిన షెడ్యూల్‌ను నాలుగు రోజులు ముందుకు అంటే 18వ తేదీకి 14కు కుదించి, 14న ఫోటోలతో కూడిన తుది జాబితాను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ సవరణ ఉత్తర్వుల్లో భాగంగా ఈనెల 10న వార్డుల్లో ఓటరు జాబితా ముసాయిదా విడుదల చేసి, 12 వరకు అభ్యంతరాలను పరిష్కరించాలని, అంతకు ముందు ఈ నెల 11న రాజకీయ పక్షాలతో జిల్లా కలెక్టర్లు సమావేశం కావాలని షెడ్యూల్‌లో వివరించారు. ఈనెల 13న ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి, 14న ఓటర్ల తుది జాబితా విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 13న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళల రిజర్వేషన్లు ఖరారైన జాబితా అందిన తర్వాత.. ఏ క్షణమైనా నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది. 
 
ప్రభుత్వానికి ముసాయిదా 
మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను కూడా ప్రభుత్వానికి ఇప్పటికే ఎస్‌ఈసీ సమర్పించినట్టు తెలుస్తోంది. ఆగస్టు మొదటివారంలోగా ఓట్ల లెక్కింపు పూర్తిచేయడంతో పాటు నూతన పాలకవర్గాలకు పదవీ బాధ్యతలను అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 
 
సామాగ్రి సిద్ధం చేసుకోవడంపై 
ఎన్నికల నిర్వహణకు వివిధరూపాల్లో అవసరమైన సామాగ్రిని తయారు చేసుకోవాలని వివిధ శాఖలు, విభాగాలను ఎస్‌ఈసీ ఆదేశించింది. ఇందులో భాగంగా ఎన్నికలకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ను పూర్తి చేయాలని సూచించింది. గైడ్‌లైన్స్‌ పుస్తకాలు, కవర్లు, నామినేషన్ల పత్రాలతో పాటు ఎన్నికల సంబంధించిన సామాగ్రిని సేకరించడం, ప్రింటింగ్‌ చేయడం వంటి వాటిని ఈనెల 17లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. శాంతిభద్రతలపై చర్చించారు. పురపాలక ఎన్నికల ఏర్పాట్లకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని డీజీపీ వివరించారు. 
 
మూడు వార్డులకో గెజిటెడ్‌ అధికారి 
మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల అధికారుల నియామకాన్ని పూర్తిచేసి జాబితాను వెంటనే పంపించాలని మున్సిపల్‌æశాఖను ఎస్‌ఈసీ ఆదేశించింది. ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రతి మూడు వార్డులకు ఒక గెజిటెడ్‌ అధికారిని నియమించాలని సూచించారు. దీని ప్రకారం నామినేషన్ల దాఖలు కూడా ప్రతి మూడు వార్డులకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు