కేసీఆర్‌కు అండగా మున్నూరు కాపులు 

2 Mar, 2019 02:46 IST|Sakshi
ప్రకాశ్, రమేశ్‌ హజారీ

మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్‌ పుటం పురుషోత్తం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచి బంగారు తెలంగాణ నిర్మాణంలో మున్నూరుకాపులు ముందుంటారని తెలంగాణ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్‌ పుటం పురుషోత్తం పటేల్‌ అన్నారు. కులవృత్తులను కాపాడడంతోపాటు వ్యవసాయదారులకు పథకాలను అమలు చేయడంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మహాసభ రాష్ట్ర కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్, కోశాధికారి ఇసంపెళ్లి వెంకన్న తదితరులతో కలసి ఆయన మాట్లాడారు.

ముదిరాజ్‌లు, గొల్ల కుర్మలు తదితర దళిత బహుజన కుల సోదరులు ఒకవైపు తమ కులవృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు వ్యవసాయం చేస్తుంటారని, వారి కులవృత్తులతో పాటు వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. అయితే మున్నూరుకాపుల ఏకైకవృత్తి వ్యవసాయమేనని, ప్రభుత్వం తమకు ప్రత్యేక వెసులుబాటు కల్పించి ఆదుకోవాలని కోరారు. మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతోపాటు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందజేయాలని కోరారు. హైదరాబాద్‌లోని మున్నూరు కాపు మహాసభను దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుంచి వేరు చేసి, ఆస్తులను మహాసభకే అప్పగించాలని కోరారు.  

గౌరవాధ్యక్షుడిగా ప్రకాశ్‌.. 
తెలంగాణ మున్నూరుకాపు మహాసభ గౌరవాధ్యక్షుడిగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ను ఎన్నుకున్నట్టు పురుషోత్తం తెలిపారు. టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సి.విఠల్, ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి రమేశ్‌ హజారీలను మహాసభ గౌరవ సలహాదారులుగా నియమించినట్టు వెల్లడించారు. మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా నీల పద్మ, యూత్‌ విభాగానికి ఆకుల స్వామి పటేల్, ఐటీ విభాగానికి వెలగపల్లి వామన్‌రావు, కోకన్వీనర్‌గా అశోక్, ప్రొఫెషనల్‌ కన్వీనర్‌గా మామిడి అశోక్‌లను నియమించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు