విద్యావ్యాపారాన్ని అరికట్టాలి

4 Apr, 2015 01:57 IST|Sakshi
విద్యావ్యాపారాన్ని అరికట్టాలి

విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. నారాయణ

 
మహబూబాబాద్ : ప్రజా ఉద్యమాల ద్వారానే విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణ పిలుపునిచ్చారు. విద్య పరిరక్షణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వీరభవన్‌లో శుక్రవారం విద్యారంగ పరిరక్షణ-సమస్యలు-కామన్ విద్యా విధానం అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మైస శ్రీనివాస్, విద్యా పరిరక్షణ కమిటీ సభ్యుడు టి.లింగారెడ్డి అధ్యక్షత వహించగా నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

విద్యారంగంలోకి విదేశీ శక్తులను, పెట్టుబడిదారులను పాలకులు ఆహ్వానించటంతో విద్యారంగం వ్యాపారరంగంగా మారిందన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో విద్య కోసం కేటాయించిన నిధులే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బయటపడిందన్నారు. విద్యారంగం ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే సమాజానికి మేలు జరుగుతుందన్నారు.

టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మైస శ్రీనివాస్ మాట్లాడుతూ కామన్ విద్యావిధానం అనే పదానికి అర్థాన్ని ప్రభుత్వం మార్చేసిందన్నారు. ప్రైవేట్ కార్పోరేట్ రంగాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ రంగంలోని వివిధ యాజమాన్యాలను కలపడమే కామన్ విధానం అని ప్రభుత్వం కొత్త అర్థాన్ని చెబుతూ ప్రజలను మభ్య పెడుతుందన్నారు.

కార్యక్రమంలో కమిటీ కోకన్వీనర్ ఎ.రవీందర్ రెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.గోవర్దన్, ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు అశోక్ స్టాలిన్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి విజయసారథి, సీపీఐ పట్టణ కార్యదర్శి అజయ్,  పీడీఎస్‌యూ నాయకులు బి.రవిచంద్ర, పైండ్ల యాకయ్య, టీవీవీ నాయకులు అనీల్, న్యూడెమోక్రసీ నాయకులు దేశెట్టి రాంచంద్రయ్య, పలు సంఘాల నాయకులు బాల కుమార్, లింగ్యా, సందీప్, యాకాంబ్రం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గీత, ప్రభాకర్, బి.రమేష్, చుంచు శ్రీశైలం, వనజ, సువర్ణ, రాజు, సైదులు, వీరస్వామి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు