మరో ఏడడుగుల దూరంలో సాగర్‌

1 Sep, 2018 01:10 IST|Sakshi

590 అడుగులకు గానూ 583 అడుగులకు చేరిన నీటి మట్టం

290 టీఎంసీల నిల్వలు, లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

నిండుకుండను తలపిస్తున్న నాగార్జునసాగర్‌

సాక్షి, హైదరాబాద్‌ : నాగార్జున సాగర్‌ జలాశయం కొద్దిరోజుల్లోనే నిండుకుండలా మారనుంది. మరో ఏడడుగుల మేర నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోనుంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 583 అడుగులకు చేరింది. మొత్తంగా 312.24 టీఎంసీలకు గానూ 290.22 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ప్రాజెక్టులోకి ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, సాగు, తాగు అవసరాల నిమిత్తం 40 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే శ్రీశైలం జలాశయానికి వరద పెరగడంతో మరోసారి రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. దీంతో సాగర్‌కు మరిన్ని రోజులు ప్రవాహాలు స్థిరంగా కొనసాగనున్నాయి. దీంతో సాగర్‌ రేడియల్‌ క్రస్ట్‌గేట్లను సోమవారం లేదా వరద తీవ్రమైతే ఈలోపే ఎత్తే అవకాశాలున్నాయి. ఇక కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లకు స్థిరంగా లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, తుంగభద్రకు 61 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో మరిన్ని రోజులు కృష్ణా బేసిన్‌లో మంచి ప్రవాహాలు కొనసాగనున్నాయి. 

సాగర్‌ కొత్త సీఈగా నర్సింహ... 
గత నాలుగేళ్లుగా సాగర్‌ సీఈగా ఉన్న సునీల్‌ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఆయన హయాంలోనే సాగర్‌ కాల్వల ఆధునీకరణ జరగ్గా, ఒక టీఎంసీ నీటితో 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వగలిగారు. ఆయన స్థానంలో సాగర్‌ ప్రాజెక్టులో ఎస్‌ఈగా ఉన్న నర్సింహను సీఈగా నియమించారు. పదేళ్ల తర్వాత జోన్‌–6కు చెందిన ఇంజనీర్‌ను సీఈగా నియమించడంపై హైదరాబాద్‌ ఇంజనీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేందర్, చక్రధర్‌లు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు