పూలమ్మిన పిల్లాడు... రూ.79.18 లక్షల ఉద్యోగి

4 Dec, 2014 10:20 IST|Sakshi
పూలమ్మిన పిల్లాడు... రూ.79.18 లక్షల ఉద్యోగి

షేక్ జమాలుద్దీన్ పొట్ట చేతబట్టుకుని నల్లగొండ జిల్లా సూర్యాపేటకు వలస వచ్చాడు. జమాలుద్దీన్ గ్రానైట్ కంపెనీలో కూలిపని చేస్తుండగా, రహిమున్నిసా టైలరింగ్ చేసేది. దంపతులిద్దరూ ముగ్గురు పిల్లలను ప్రయోజకులుగా చూడాలని తాపత్రయపడ్డారు. వారి తపనకు పిల్లల పట్టుదల తోడైంది. కాయకష్టం చేసే తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేందుకు కొడుకు షేక్ నజీర్‌బాబా సెలవు దినాల్లో పూలసెంటర్, పాతబస్టాండ్‌లో పూలు కూడా అమ్మేవాడు. అలా అమ్మిన కుర్రాడే పదోతరగతిలో స్టేట్‌ఫస్ట్ వచ్చాడు. ఆపై కాన్పూర్ ఐఐటీలో సీటుకూడా సంపాదించాడు. అమెరికాకు చెందిన ఒరాకిల్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్‌ టర్వ్యూలో అప్లికేషన్ ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. వార్షిక వేతనమెంతో తెలుసా రూ. 79.18లక్షలు.

సూర్యాపేట: అర్వపల్లి మండలం కోడూర్ గ్రామానికి చెందిన షేక్ జమాలుద్దీన్-రహిమున్నీసా దంపతులు 30 ఏళ్ల క్రితం పొట్టచేత పట్టుకొని సూర్యాపేట పట్టణానికి వలస వచ్చారు. ఓ పూట పస్తులున్నా సరే ముగ్గురు పిల్లలను ఉన్నత స్థానాల్లో చూడాలనే తపనతో చదివిస్తున్నారు. వారి తపనకు పిల్లల పట్టుదల తోడై నేడు వారి కుమారున్ని అత్యున్నతమైన ఉద్యోగానికి ఎంపికయ్యేలా చేసింది.

సూర్యాపేట పట్టణంలోని నవోదయ పాఠశాలలో 10వ తరగతి దాకా తెలుగు మీటియంలో విద్యనభ్యసించిన వారి కుమారుడు షేక్ నజీర్‌బాబా. ఈ నెల 1న కాన్పూర్ ఐఐటీలో అమెరికాకు చెందిన ఒరాకిల్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్‌ఇంటర్యూలో సంవత్సరానికి రూ.79.18 లక్షల ఉద్యోగానికి ఎంపికయ్యాడు. రెండు సంవత్సరాల క్రితం నల్లగొండ పట్టణానికి చెందిన శ్రీరామ్‌భార్గవ్ ఐఐటీ బాంబే క్యాంపస్ ఇంటర్వ్యూలో రూ.80 లక్షల వేతనానికి ఎంపిక కాగా తిరిగి జిల్లాకు చెందిన మరో విద్యార్థి అయిన నజీర్‌బాబాకు ఇంత పెద్ద మొత్తంలో వేతనం లభించడం అరుదైన విషయం.

నజీర్‌బాబా 2008-09లో పదో తరగతి పరీక్షలు రాసి 600 మార్కులకు 587 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆయన పేదరికాన్ని గుర్తించిన పాఠశాల కరస్పాండెంట్ మారం లింగారెడ్డి శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యంతో మాట్లాడి ఇంటర్మీడియట్‌లో ఉచిత విద్యనందించేందుకు ఒప్పించి ఎంపీసీలో చేర్పించాడు. నజీర్‌బాబా పట్టుదలతో చదివి ఇంటర్‌లో 969 మార్కులు సాధించాడు. 2011 ఐఐటీ ప్రవేశపరీక్షలో ఆలిండియాలో 239వ ర్యాంకు సాధించి కాన్పూర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో చేరాడు.

ఐఐటీలో కష్టపడి చదువుతూ 9.4 క్యుమిలేటివ్ పెర్‌ఫార్మెన్స్ ఇండెక్స్ (సీపీఐ) సాధించాడు. చివరి సంవత్సరం పూర్తి కాకముందే జరిగిన క్యాంపస్ నియామకాల్లో అత్యధిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా నజీర్‌బాబా ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ లక్ష్యాన్ని ఎంచుకొని కష్టించి పనిచేస్తే దేనినైనా సాధించవచ్చన్నారు. కష్టపడకుండా ఏదీ సాధ్యపడదన్నారు. ఇష్టంతో చదవాలని సూచించారు. తాను ఈ స్థానానికి చేరుకోవడానికి తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కారణమన్నారు. ఎంతో మంది ఆర్థిక సహకారమందించేందుకు కృషిచేసిన కరస్పాండెంట్ మారం లింగారెడ్డి-ఝాన్సీ దంపతులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

సెలవుల్లో పూలమ్మిన నజీర్‌బాబా..
ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు పాఠశాల, కళాశాల సెలవు దినాల్లో పూలు అమ్మి ఎంతోకొంత సంపాదించి అమ్మానాన్నలకు ఆసరాగా ఉండేందుకు కూడా నజీర్‌బాబా వెనుకాడలేదు. ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన అనంతరం వేసవి సెలవుల్లో సూర్యాపేట పట్టణంలోని పూలసెంటర్, పాతబస్టాండ్ ప్రాంతాల్లో కొద్దిరోజులు పూలమ్మినట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు