‘కొండగట్టు’ వద్ద నారాయణ బలిహోమం

27 Sep, 2018 04:52 IST|Sakshi
హోమం నిర్వహిస్తున్న పరిపూర్ణానందస్వామి

జగిత్యాల జోన్‌/కొండగట్టు: కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో బుధవారం నారాయణ బలిహోమం నిర్వహించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రీ, పులి సీతారామ శాస్త్రీ, శ్రీనివాసశర్మ తదితర వేద పండితుల బృందం రెండు గంటలపాటు హోమం నిర్వహించింది. యాగం నిర్వహిస్తున్న స్థలంలోని వేదికపై దాదాపు అరగంట పాటు స్వామిజీ ప్రత్యేక జపం చేస్తూ, మౌనంగా ఉండిపోయారు. ప్రమాద స్థలంలోనే 50 మందికిపైగా చనిపోయినందున సామూహికంగానే మృతులకు పిండ ప్రదానం చేశారు. యజ్ఞహోమం వద్ద పిండాలను ఏర్పాటు చేసి.. మృతుల కుటుం బాలతో పిండాలు ప్రదానం చేయించారు. అనం తరం ధర్మపురి గోదావరిలో కలిపేందుకు తీసుకెళ్లారు. కాగా, కొండగట్టు బస్సు ప్రమాద స్థలాన్ని గోదావరి నీటితోపాటు యజ్ఞ విభూతితో శుద్ధి చేశారు. ప్రత్యేక పూజలూ చేశారు.

వస్త్రాల బహూకరణ: మృతుల కుటుంబాలకు పరిపూర్ణానంద స్వామి తన చేతుల మీదుగా వస్త్రాలను బహూకరించారు. ఆ సమయంలో బాధితులు తమవారిని తలుచుకుని స్వామివారి పాదాలపై పడి ఏడ్వడం చూసేవారికి సైతం కన్నీళ్లను తెప్పించింది. మృతుల కుటుంబీకులు సంతోషంగా ఉండాలని స్వామి ఆకాంక్షించారు.
 

మరిన్ని వార్తలు